ఓట్ల కోసం పాట్లు! | to attract voters | Sakshi
Sakshi News home page

ఓట్ల కోసం పాట్లు!

Published Wed, Apr 16 2014 1:58 AM | Last Updated on Thu, Aug 30 2018 5:38 PM

to attract voters

 

  •      అపార్టుమెంట్లపై అభ్యర్థుల దృష్టి
  •      ‘ఇంటింటికీ బొట్టు’ కార్యక్రమం
  •      కాలనీ సంఘాలకు కాసుల ఎర!

 సాక్షి, సిటీబ్యూరో: నిత్యం రోడ్డు షోలు, పాదయాత్రలు, ర్యాలీలతో ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థులు జోరు మరింత పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ఓ చుట్టు చుట్టిన అభ్యర్థులు మలిదశలో ఓటర్లను నేరుగా కలుసుకొనేందుకు రంగంలోకి దిగుతున్నారు.

ఇందులో భాగంగా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు, గ్రూపు హౌస్‌లపై దృష్టి పెట్టారు. ఒక్కో అపార్టుమెంట్‌లో సుమారు 150 నుంచి 300 వరకు ఓటర్లు ఉండటతో అభ్యర్థుల చూపు వాటిపై పడింది. వీరందరినీ నేరుగా కలుసుకోవడం వల్ల వారి అభిమానం చూరగొనడమేగాక పేరుపేరునా పలకరించి ఓట్లను రాబట్టుకోవాలని భావిస్తున్నారు.
 
ఇందుకోసం ఆయా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీల్లో ఉండే సంక్షేమ సంఘాలు, అపార్టుమెట్ కమిటీలు, వెల్ఫేర్ అసోసియేషన్ల అధ్యక్షులతో మంతనాలు జరుపుతున్నారు. అవసరమైతే కాసులు ఎరగా వేస్తూ తమకు పక్కాగా ఓట్లు వేయించే లా లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొనేందుకు స్థానిక నాయకులను రంగంలోకి దించారు. కొన్నిచోట్ల ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను పరిష్కరింస్తానమి హామీ ఇస్తున్నారు.
 
కాలనీల్లో సౌకర్యాలు కల్పిస్తామంటూ..

ప్రస్తుతం ఎండాకాలం కావడంతో కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్ వాసులు తాగునీటికి సమస్యతో సతమతమవుతున్నారు. అలాంటి చోట్ల బోర్లు వేయించేందుకు కూడా పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. భూగర్భ జలాలులేక సాధ్యంకానిచోట మాత్రం ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆయా కమిటీ, వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులతో స్థానిక నాయకుల చేత చర్చలు జరిపి డీల్ ఓకే అయ్యాక.. అక్కడ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు.
 
అలాగే అపార్టుమెంట్లలోని యువకులను ఆకట్టుకొనేందుకు పలువురు అభ్యర్థులు వారికి క్రికెట్ కిట్లను ఎరగా వేస్తున్నారు. వీటిని నేరుగా పంపిణీ చేస్తే పట్టుబడే ప్రమాదం ఉండటంతో  ఫలానా దుఖాణానికి వెళ్లి తీసుకోవాలని, బిల్ తాము చెల్లిస్తామంటూ కోడ్ భాషతో ఉన్న చీటీలు ఇస్తున్నారు. అయితే... ఓట్లు మాత్రం గంపగుత్తగా తమకే పడాలన్న ఒప్పందంతోనే అభ్యర్థులు ఈరకమైన ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
 
 బొట్టు పెట్టి అభ్యర్థన..
డబ్బు వెచ్చించేందుకు అంతగా ఇష్టపడని అభ్యర్థుల సతీమణులు మాత్రం కొందరు మహిళా కార్యకర్తలను వెంటేసుకొని సాయంత్రం వేళల్లో కాలనీలు, అపార్టుమెంట్లలో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమ పతిని గెలిపిస్తే స్థానికంగా ఉన్న సమస్యలను దగ్గరుండి మరీ పరిష్కరింపజేస్తానని చెబుతున్నారు.
 
పగటి పూట ఎండ తీవ్రంగా ఉంటుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఈ బొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి మలక్‌పేట, ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్‌పేట, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కార్వాన్, గోషామహల్, సికింద్రాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా ప్రచారం జోరుగా సాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement