హోరెత్తిన రోడ్ షో..
- కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ, సీపీఎం శ్రేణులు
- చిందేసిన తెల్లం వెంకట్రావ్, సున్నం రాజయ్య
- భద్రాద్రిలో అడుగడుగునా అపూర్వ స్వాగతం
- అందుబాటులో ఉంటాం..ఆశీర్వదించండి : డాక్టర్ వెంకట్రావు, సున్నం రాజయ్య
భద్రాచలం, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ, సీపీఎం శ్రేణులు సోమవారం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షో విజయోత్సవాన్ని తలదన్నేలా సాగింది. వైఎస్సార్‌సీపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, సీపీఎం భద్రాచలం అసెంబ్లీ అభ్యర్థి సున్నం రాజయ్యలు ఈ రోడ్‌షోలో ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రచార రోడ్‌షోలో గిరిజనుల కొమ్ము నృత్య కళాకారులు ఆటపాటలతో ముందు నడువగా, డప్పు వాయిద్యాలు, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ పాల్గొన్నారు. భద్రాచలం పట్టణంలోని అన్ని వీధుల్లో సాగిన ఈ ర్యాలీకి వివిధ వ ర్గాల ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. బుధవారం జరుగనున్న ఎన్నికల్లో వీరిద్దరికే ఓట్లు వేస్తామన్న రీతిలో భరోసా ఇచ్చేలా పట్టణ ప్రజానీకం పలికిన స్వాగతం ఆ పార్టీల శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిం ది. ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన ఇరువురు నేతలు కూడా వాహనం దిగి కార్యకర్తలతో పాటు చిందేసి వారికి మరింత ఉత్సాహాన్ని నింపారు.
నిజాయితీకి పట్టం కట్టండి
ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావ్ మాట్లాడు తూ అభ్యర్థుల గుణగణాలతో పాటు నిజాయితీని చూసిఓటు వేసి గెలిపించాలని కోరారు. సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, రోగి నాడి తెలిసిన డాక్టర్‌గా వైద్యం చేస్తున్న తాను ప్రజా సమస్యలు కూడా తెలుసుకుని ఓ మంచి నాయకుడిగా పని చేస్తానని అన్నారు. తనను గెలిపిస్తే భద్రాచలం నియోజకవర్గ ప్రజానీకానికి ఏది అవసరం గుర్తించి పనిచేస్తానన్నారు. నీతి నిజాయితీగా ఉండే తనను గెలిపించేందుకు ప్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం గెలుపు అవసరం
భద్రాచలంలో నియోజకవర్గంలో సీపీఎం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో వైఎస్సార్‌సీపీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సున్నం రాజయ్య అన్నారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజానీకం భవిష్యత్‌కు దశ, దిశ నిర్ధేశం చేసే ఈ ఎన్నికల్లో మంచి వ్యక్తులకు పట్టం కట్టాలన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను నిస్వార్ధంగా, నిరాడంబరంగా పనిచేశానని గుర్తు చేశారు. కానీ ఒక్క సారి గెలిచిన వారు కూడా కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న విషయాన్ని ఈ ప్రాంత ప్రజానీకం గుర్తుంచుకోవాలన్నారు. అదే విధం గా కేవలం ఎన్నికలప్పుడు కనిపించే టీడీపీ వంటి పార్టీలకు ఓటు వేసినా ప్రజల కష్టాలు తీరవవన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కడియం రామాచారి, సీనియర్ నాయకులు గంటా కృష్ణ, కొవ్వూరి రాంబాబు, దామెర్ల రేవతి, లక్ష్మీబాయి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బీ వెంకట్, పీ సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఏజే రమేష్, బ్రహ్మచారి, బీబీజీ తిలక్, గిరిప్రసాద్, జీఎస్ శంకర్‌రావు, ఎంబీ నర్సారెడ్డి, ముదిగొండ నాగేశ్వరరావు, బండారు శరత్‌బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు బానోతు రాముడు, రాయిని రమేష్, లక్ష్మీబాయి, నీరజ, రాజు, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.