వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు సీపీఎం మద్దతు
భీమవరం టౌన్, న్యూస్‌లైన్ : బీజేపీ ఓటమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంతెన సీతారాం తెలిపారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ వంటి ప్రమాదకరమైన పార్టీ మరొకటి లేదని, కరుడుగట్టిన మతోన్మాది నరేంద్రమోడీ అని ఆయన ధ్వజమెత్తారు. భీమవరంలో మోడీ సభ విఫలమైందని టీడీపీ, బీజేపీ పార్టీలు కిరాయికి జనాన్ని తరలించినా సభ విజయవంతం కాలేదన్నారు. నరసాపురం బీజేపీ లోక్‌సభ అభ్యర్థి గోకరాజు గంగరాజును ఓడించేందుకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వంక రవీంద్రనాథ్‌కు, తాడేపల్లిగూడెంలో తోట గోపికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. విప్లవ నాయకుడైన చేగువెరా ఫొటో పెట్టుకుని బీజేపీకి ఓట్లేయమనడం విచిత్రంగా ఉందన్నారు. సీపీఎం రాష్ర్ట కమిటీ నాయకులు అల్లూరి సత్యనారాయణరాజు, జిల్లా కార్యవర్గం సభ్యులు బి.బలరాం, గోపాలన్ పాల్గొన్నారు.