రోజురోజుకూ పెరుగుతున్న బాలకార్మికుల సంఖ్య | today children's day | Sakshi
Sakshi News home page

రోజురోజుకూ పెరుగుతున్న బాలకార్మికుల సంఖ్య

Published Fri, Nov 14 2014 12:21 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

today children's day

పరిగి: బాల్యం పిల్లల హక్కు.. పిల్లలుండాల్సిన చోటు పాఠశాలలే.. బడికెళ్లని పిల్లలందరూ బాలకార్మికులే.. పెద్దలు పనికి, పిల్లలు బడికి.. ఇవి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సూత్రాలు... గోడలపై రాసుకున్న రాతలు. అయితే వీటితో ప్రభుత్వం రాజీపడుతోంది. ఈ నినాదాలు సమావేశాలు, సదస్సులు దాటి కార్యాచరణకు నోచుకోవడం లేదు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి తెచ్చిన విద్యాహక్కు చట్టం వచ్చాక బాలకార్మికుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం మరో విశేషం.

 తూతూమంత్రంగా  కార్యక్రమాలు....
 ఎన్‌రోల్‌మెంట్‌డ్రైవ్, చదువుల పండగ, బడిబాట, విద్యా వారోత్సవాలు, విద్యా పక్షోత్సవాలు, విద్యా సంబురాలు ఇలా పది సంవత్సరాలుగా బాలకార్మికులను బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు. అయితే వీటిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయకపోవడంతో బాలకార్మికుల సంఖ్య పెరగడమేగాని తగ్గడం లేదు. విద్యాహక్కుచట్టం(2009) అమల్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు కావస్తున్నా.. ఇప్పటికీ సంచారంలో, ఇటుక బట్టీల్లో, హోటళ్లలో, దాబాల్లో, దుకాణాల్లో , వెట్టిచాకిరీలో చిన్నారులు మగ్గుతూనే ఉన్నారు.

 పరిగిదే మొదటి స్థానం
 బాలకార్మికుల సంఖ్యలోనూ, నిరక్షరాస్యతలోనూ జిల్లాలో పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల, గండేడ్, దోమ మండలాలే ముందుస్థానంలో ఉన్నాయి. పరిగి, పూడూరు మండలాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పలు స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం కుల్కచర్లలో 600 మంది, గండేడ్‌లో 500 పై చిలుకు బాలకార్మికులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్క పరిగి పట్టణవలోనే 300 వరకు బాలకార్మికులు ఉన్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి.

వేల సంఖ్య లో బాలకార్మికులు బడిబయట ఆయా పనుల్లో కొనసాగుతున్నా వారిని బడిలో చేర్పించేందుకు ప్రత్యేకమైన వింగ్ లేకపోవడం దురదృష్టకరం. కళ్ల ఎదుటే బాలకార్మికులు కనిపిస్తున్నా ఇటు విద్యాశాఖ, అటు లేబర్ ఆఫీసర్లకుగాని పట్టడంలేదు.

  పొంతన లేని లెక్కలు.....
 బడిబయటి పిల్లల్ల గుర్తింపుకోసం నిర్వహిస్తున్న సర్వేలు ఒకదానితో ఒకదానికి పొంతన లేకుండా ఉన్నాయి. బడిబయట ఉన్న పిల్లల పేర్లు బడిలోకి వస్తున్నాయే తప్పా పిల్లలు మాత్రం బడులకు దూరంగానే ఉంటున్నారు. జిల్లాలో 2 వేల మంది బాలకార్మికులు ఉన్నట్లు విద్యా శాఖ అధికారులు చెబుతుండగా ఆరువేల మంది ఉన్నారని గతేడాది సాక్షరభారత్ కార్యకర్తలు నిర్వహించిన సర్వేలో బయటపడింది.

అదే సమయంలో ఎంవీ ఫౌండేషన్‌లాంటి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్న లెక్కల ప్రకారం రూరల్, అర్బన్ ఏరియాల్లో కలిపి దాదాపు 10 వేల మంది పిల్లలు బడికు దూరంగా ఉంటూ పనులు చేసుకుంటున్నారని సమాచారం. నెలరోజులు రెగ్యులర్‌గా ఓ విద్యార్థి బడికి రాకుంటే బాలకార్మికునిగా గుర్తించి బడికి రప్పించే చర్యలు చేపట్టాలని సర్వశిక్ష అభియాన్ చెబుతుండగా వాస్తవంలో ఆరు నెలలకు పైగా బడిబయట ఉన్న పిల్లలను కూడా బాలకార్మికులుగా గుర్తించటంలేదు. దీనికితోడు సంచార జాతుల్లో దాదాపు పిల్లలందరూ బాల కార్మికులుగానే కొనసాగుతున్నారు.

విద్యాశాఖ అధికారుల లెక్కల్లో కనీసం వీరు పరిగణలోకి కూడా రావడం లేదు. అయితే ఐదేళ్లు నిండిన పిల్లలందరూ బడుల్లోనే ఉండాలనే సామాజిక నియమం వస్తే తప్పా బాలకార్మిక వ్యవస్థను రూపుమాపలేమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బడిబయటి పిల్లలందర్ని బడిలో చేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయినప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, యువజన సవఘాలు, మహిళా సంఘాలు, సామాజికవేత్తలు, ప్రజాప్రతినిధులు తదితర వర్గాలు కూడా పిల్లలందర్నీ బడిలో చేర్పించేలా ప్రజలను చైతన్య పరిస్తే తప్పా బాల కార్మిక వ్యవస్థ నుంచి మన సమాజం బయట పడదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement