ముహూర్తం 9.55 గం॥
నేడు యాదాద్రిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గుట్టకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం (యాదాద్రి) అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పెద్దగుట్ట వద్ద రాజగోపురం పనులను ప్రారంభించనున్నారు. టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ హోదాలో సీఎం పలు కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ఉదయం 9.20 గంటలకు హెలికాప్టర్ ద్వారా సురేంద్రపురికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు వెళతారు. గర్భాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని 9.55 గంటలకు కేసీఆర్ ఆవిష్కరిస్తారు. అక్కడి సుదర్శన చక్రం పక్కన ఏర్పాటు చేసిన మరో శిలాఫలాకానికి గవర్నర్ నరసింహన్ శంకుస్థాపన చేస్తారు.
అనంతరం కేసీఆర్ అరగంట పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సంగీత భవన్‌లో అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అండాళు నిలయంలో అన్ని శాఖల అధికారులతో సుమారు రెండు గంటల పాటు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు త్రిదండి చినజీయర్ స్వామి కూడా పాల్గొంటారు. కాగా, గుట్ట పర్యటన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్‌లో గజ్వేల్ నియోజకవర్గం ములుగుకు కేసీఆర్ చేరుకుంటారు. అక్కడి పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ కప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.