ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆహార భద్రత కార్డులు, పింఛన్లకు ఆర్జీల స్వీకరణ గడువు సోమవారం సాయంత్రంతో ముగియనుంది.
ఖమ్మం జడ్పీ సెంటర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆహార భద్రత కార్డులు, పింఛన్లకు ఆర్జీల స్వీకరణ గడువు సోమవారం సాయంత్రంతో ముగియనుంది. తొలుత ఈ నెల 15వ తేదీ వరకు గడువు విధించిన ప్రభుత్వం జిల్లాల కలెక్టర్‌లు, ప్రజల అభ్యర్థన మేరకు తిరిగి ఆ గడువును 20వ తేదీ వరకు పొడగించింది. దీంతో ఈ నాలుగు రోజులుగా దరఖాస్తులు అందించేందుకు ప్రజలు ఆయా మండల కార్యాలయాల వద్ద బారులు తీరారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగానే తనిఖీ బృందాలకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టనుంది.
21న తనిఖీ బృందాలకు శిక్షణ...
ఆహారభద్రత, పింఛన్లు, ఫాస్ట్ పథకాల కోసం దరఖాస్తులను పరిశీలించేందుకు 21వ తేదీన ఖమ్మంలో బృందాలకు శిక్షణ ఇచ్చేం దుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి అనర్హులను తొలగించేందుకు ఈ తనిఖీ చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తనిఖీకి వెళ్లే బృందాలకు ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. 22వ తేదీ నుంచి ఆ బృందాలు గ్రామాలకు వెళ్లి తనిఖీ నిర్వహించనున్నారు.
పూర్తి సమాచారంతో ఈ బృందాలు గ్రామాల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసుకున్న వారిని ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి తమ వద ఉన్న సమాచారంతో సంక్షేమ పథకాలకు అర్హులా..? కాదా..? అన్న విషయాన్ని ధ్రువీకరించి నివేదికను అందించనున్నారు.
లక్షల్లో దరఖాస్తులు.....
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు రేషన్‌కార్డులకు బదులు ఆహారభద్రత కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డులు అందించేందుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ ఆహారభద్రత కార్డుల కోసం శనివారం వరకు 6లక్షల17వేల దరఖాస్తులు, సామాజిక పింఛన్ల కోసం 2లక్షల80వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.