
వైఎస్సార్ 6వ వర్ధంతి నేడు
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి
♦ ఘనంగా నిర్వహించాలని ఎంపీ మేకపాటి పిలుపు
♦ పార్టీ కేంద్ర కార్యాలయంలో సేవా కార్యక్రమాలు
♦ నివాళులర్పించనున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 6వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల కోసం సీఎంగా వైఎస్ చేపట్టిన పథకాలు చిరస్మరణీయమైనవని చెప్పారు. అందుకే ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా అశేషంగా అభిమానులున్నారని తెలిపారు.
పేదలకు ఆహారభద్రత, ఆరోగ్య భద్రత, నివాస భద్రత వంటివి కల్పించిన ఘనత వైఎస్‌దేన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడంతోపాటు అన్ని సదుపాయాలు కల్పించి వ్యవసాయాన్ని పండుగగా మార్చారని కొనియాడారు. మహానేత అధికారంలో ఉన్న ఐదేళ్లు అదృష్టం వల్ల వర్షాలు బాగా కురిసి రైతులు సంతోషంగా ఉన్నారని వివరించారు. ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒకేసారి 86 ప్రాజెక్టులు చేపట్టిన ఘనత వైఎస్‌దేనని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని తపించారని గుర్తుచేశారు.
అలాంటి మహనీయుడి వర్థంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్ర కార్యాలయానికి వచ్చి వైఎస్‌కు నివాళులర్పిస్తారని చెప్పారు. అనంతరం పంజాగుట్టలో వైఎస్ విగ్ర హం వద్ద శ్రద్ధాంజలి ఘటించి అసెంబ్లీకి హాజరవుతారని వెల్లడించారు.
ఇడుపులపాయకు జగన్
తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. జగన్ బుధవారం రాత్రి అక్కడి నుంచి బయలుదేరి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి గురువారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు.