నేడు ప్రపంచ వారసత్వ దినం | Today is World Heritage Day | Sakshi
Sakshi News home page

నేడు ప్రపంచ వారసత్వ దినం

Published Fri, Apr 18 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM

Today is World Heritage Day

జుక్కల్, న్యూస్‌లైన్:  జిల్లాలోని చారిత్రక సంపదకు రక్షణ కరువైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన అనేక కట్టడాలు శిథిలమవుతున్నాయి. జుక్కల్ మండలం కౌలాస్ కోటదీ ఇదే స్థితి.

 జుక్కల్  మండలం కౌలాస్ గ్రామం వద్ద 1544 సంవత్సరంలో కౌలాస ఖిల్లాను నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బాల్ ఘాట్ పర్వతాలలో కౌలాస అనే మహాముని తపస్సు చేసిన ప్రాంతంగా పేరున్నా ఈ ఖిల్లాకు కౌలాస ఖిల్లాగా నామకరణం చేసినట్లు కథనం ఉంది. ఇది రాష్ట్ర కూటులు, కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చెబుతారు. మహ్మద్‌బిన్‌తుగ్లక్ పాలనలో కూడా ఈ కోట ప్రసిద్ధి చెందింది. కాకతీయులపై అల్లాఉద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసిన తర్వాత  నాలుగు భాగాలుగా విభజించబడింది. బహమణి సుల్తానుల రాజ్యంలో ఇందూరు, కౌలాస ఖిల్లాలు ఉండేవి.

కుతుబ్‌షాహి రాజ్యంలో కౌలాస్ సర్కార్‌గా పేరు గడించింది. మహారాష్ట్రలోని నాందేడ్ ఖందార్, ముఖేడ్, బాన్సువాడ బిచ్కుంద ప్రాతాలు కౌలాస రాజ్యం ఆధీనంలో కొనసాగాయి. నాలుగవ రాష్ట్రకూట రాజు  గోవిందుని కాలంలో కౌలాస ప్రాంతం గొప్ప సాంస్కృతి కేంద్రంగా విరాజిల్లింది. కౌలాస్ ఖిల్లా అనేక యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. 1857లో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కౌలాస రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజా దీప్‌సింగ్ పాల్గొనట్లు చెబుతారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న  ఈకోటను చూడడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. విలువైన శిల్ప సంపద కనుమరుగవుతండడంతో పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

 రాతి కట్టడాలు
 ఖిల్లా లోపలిభాగంలో అత్యంత నైపుణ్యంతో నిర్మించిన రాతికట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. వెంకటేశ్వర మందిరం, రామ మందిరం, దుర్గా మాత మందిరాలు రాతితో నిర్మించారు. ప్రతి మందిరం వద్ద దిగుడు బావులతోపాటు ఏనుగులు స్నానాలు చేసేందుకు పెద్ద బావులను నిర్మించారు. ప్రస్తుతం ఈబావులు రాతికట్టడాలు కూలిపోయి పూడుకు పోతున్నాయి. దుర్గామాత మందిరంలోని గర్భగుడి కింద బంగారు నిధులు ఉన్నాయనే నమ్మకంతో కొందరు దుండగులు విలువైన విగ్రహాలను తొలగించి తవ్వకాలు జరిపారు. ఎంతో నైపుణ్యంతో నిర్మించిన మందిరాల చుట్టూ ముళ్ల పొదలు మొలచి ధ్వంసం అవుతున్నాయి. కోట లోపలి భాగంలో నిర్మించిన అనేక రాతి కట్టడాలలో ధాన్యాగారం, స్నానపు గదులు, రాణి గారి పట్టెపు మంచం, తదితర కట్టడాలు కూలిపోతున్నాయి.

 మాయమైన ఫిరంగులు
 పంచ లోహాలతో తయారు చేసిన అనేక ఫిరంగులు దొంగల పాలయ్యాయి. ఈ ఫిరంగుల తయారీలో బంగారాన్ని సైతం వాడిఉంటారనే నమ్మకంతో ఎత్తుకెళ్లి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఎక్కువ బరువుతో కూడిన కొన్ని ఫిరంగులు కోట లోపల ఉన్నాయి. అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ అధికారులు కోటను సందర్శించారు. గతంలో  జిల్లా క లెక్టరుగా పనిచేసిన అశోక్  కుమార్ కోటను సందర్శించి పర్యటక ప్రదేశంగా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినా దీనిని పరిరక్షించేందుకు ఎలాంటి నిధులు విడదల కాలేదు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే వారసత్వంగా  వస్తున్న చారిత్రక ప్రదేశాలు పర్యాటకులు కనువిందు చేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement