
రేపే టెట్
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు సమయం ఆసన్నమైంది. మూడుసార్లు వాయిదా పడిన ఎట్టకేలకు ఆదివారం ముహూర్తం ఖరారైంది. జిల్లాకేంద్రంలో నిర్వహించే పరీక్షకు 8,185 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో పేపర్-1 కోసం ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,806 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష సమయం ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఉం టుంది. పేపర్-2 కోసం 30 కేంద్రాలను ఏర్పాటు చేయ గా 6,379 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఈ పరీక్ష సమయం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల నిర్వహణ కోసం 38 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 38 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 38 మంది హాల్ సూపరింటెండెంట్‌లు, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు(ఒక్కో బృందం లో ముగ్గురు సభ్యులు), 290 మంది ఇన్విజిలేటర్లు, ఆర్‌డీవో, డీఈవో స్పెషల్ అధికారులుగా ఉంటారు.
ఒత్తిడిని దూరం చేసుకోవాలి
పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షకు ఒక రోజు ముందు రాత్రి బాగా చదివేందుకు ప్రయత్నిస్తారు. కానీ అలా చేస్తే మె దడుకు తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి అలా చేయొ ద్దు. పరీక్షకు వెళ్లే ముందు తాను బాగా రాస్తానని పాజిటి వ్ దృక్పథంతో ఉండాలి. పరీక్ష కేంద్రంలో కేటాయించిన స్థానంలో కూర్చున్న తర్వాత రెండు నిమిషాలు గట్టిగా కళ్లు మూసుకుని మెదడుకు కాస్తా విశ్రాంతి ఇవ్వాలి. పరీక్ష అయ్యేంత వరకు టీవీ, చాటింగ్, సినిమా, షికార్లు మానుకోవాలి. ఆహారం మితంగా తీసుకోవాలి. నూనే పదార్థాలకు దూరంగా ఉంటూ పీచు పదార్థాలు అధికంగా తీసుకోవాలి. ఏకాగ్రతను పెంపొందించేందుకు పది నిమిషాలు ధ్యానం చేయాలి.
ఇవి తప్పనిసరి పాటించాలి..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి తప్పని సరిగా ఇంటర్నెట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్‌టిక్కెట్లో ఏవైన పొరపాట్లు జరిగాయ అనేవి చూసుకోవాలి. పరీక్షకు రెండు బ్లాక్ బాల్‌పెన్‌లు, పరీక్ష ప్యాడ్ వెంట తీసుకెళ్లాలి. పరీక్షకు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో, అక్కడికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందో ముందే తెలుసుకుని వెళ్లాలి. పరీక్షకు చాలా మంది హాజరవుతున్న దృష్ట్యా పరీక్షకు ముందుగానే వెళ్లాలి. సయమానికి బస్సులు, ఆటోలు దొరకకపోతే ఇబ్బంది పడుతారు.
పొరపాట్లు జరిగితే అంతే..
టెట్ పరీక్షకు ఓఎంఆర్ షీట్‌లో బాల్ బ్లాక్ పెన్‌తో మాత్రమే బబ్లింగ్ (వృత్తంలో ఉన్న నంబర్‌ను దిద్దడం) చేయాలి. ఒక్కొక్క అభ్యర్థికి ఒక్క ఓఎంఆర్ షీట్ మాత్రమే ఇస్తారు. హాల్‌టిక్కెట్ నంబర్ చూసుకుని నంబర్ పైన బబ్లింగ్ చేయాలి. మిగతా వాటిని ఖాళీగా ఉంచాలి. ఒకే వరుసలో ఉన్న నంబర్లలో బబ్లింగ్ చేస్తే ఓఎంఆర్ షీట్ చెల్లదు. ఒక గడిలో ఒక అంకెకు మాత్రమే బబ్లింగ్ చేయాలి. చాలా మంది అభ్యర్థులు పొరపాట్లు చేస్తారు. సమాధానం రాసేటప్పుడు మనం ఏ సమాధానానికి దిద్దుతామో గమనించుకోవాలి. పెన్‌తో బబ్లింగ్ చేయడం వల్ల వాటిని మళ్లీ సరిదిద్దలేం. సమాధానాలు ఒక్క వరస క్రమంలో చేస్తే బాగుంటుంది. మధ్యలో వాటిని వదలడం వల్ల చివరలో సమయం లేనట్లయితే ఖాళీగా వదిలేయాలి.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
పరీక్షకు మరో ఒక రోజు సమయం ఉంది. ఈ సమయం అత్యంత కీలకమైనది. ఉన్న సమయం సద్వినియోగం చేసుకోవాలి. రోజుకు కనీసం ఆరు గంటలపాటు విశ్రాంతి తప్పనిసరి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సినాప్సిస్ (చదివిన వాటిని పేపర్‌పై రాసుకున్నవి) చూసుకోవాలి. గ్రూప్ డిస్కస్ చేస్తే ఆ సబ్జెక్టులో పట్టు ఉన్నవారు చెప్పే విషయాలు త్వరగా అర్థమవుతాయి. ఏదైన ప్రశ్నకు సమాధానం రాకపోతే అక్కడే సమయం వృధా చేయకుండా మరో ప్రశ్నకు సమాధానం రాయాలి.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
టెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తాం. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. నిమిషం అలస్యమైన పరీక్ష కేంద్రంలోనికి అనుమతించం. పరీక్ష ముగిస్తేంత వరకు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లరాదు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్‌లు వెంట తెచ్చుకోవద్దు. పరీక్షలో బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వినియోగించాలి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలి. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూం నెంబర్ 08732-226434 పై సంప్రదించాలి.
- రామారావు, డీఈవో