
సాక్షి, కరీంనగర్: రైతుల ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు భరోసా కల్పించేందుకే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటన చేశామని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆయన విమర్శించారు. కేసీఆర్ చెప్పింది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. తాము రాజకీయాలు కోసం ఇక్కడకు రాలేదని.. ప్రస్తుతం ఎన్నికలు కూడా లేవన్నారు. ప్రతిపక్షాల నేతలను పచ్చిబూతులు తిట్టడం సబబు కాదన్నారు.
రెండు నెలలు గడుస్తున్నా.. కందులు,మొక్కజొన్నల పైసలు రాలేదని మండిపడ్డారు. బత్తాయి, మామిడి, బొప్పాయి, నిమ్మ రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత వల్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. ఫలితంగా అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందన్నారు. తడిసి పోతే మళ్లీ తేమ శాతం అంటూ నిబంధనలు పెడతారని ఇది న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. 40 కిలోలకు బస్తా బరువు తీసేసి తూకం వేయాలని.. కానీ 4 కిలోల తరుగు తీసేస్తున్నారని ఆరోపించారు. దీనికి సమాధానం ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment