అంబర్‌పేట్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: చిన్నారులను పాఠశాలలకు తరలించే బడి వాహనాల భద్రత అంతంత మాత్రంగా మారింది. వీటి ఫిట్‌నెస్ మాట అటుంచితే కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లూ వీటిని నడిపేస్తున్నారు. శుక్రవారం తనిఖీలు చేపట్టిన అధికారులు 12 మంది లైసెన్స్ లేని డ్రైవర్లను గుర్తించారు. యాజమాన్యాల కక్కుర్తి, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి స్కూల్ వాహనాల డ్రైవర్లు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఆర్టీఏ సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త బృందాల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టారు. ఒక్క రోజులోనే 521 కేసులు నమోదు చేశామని, భవిష్యత్‌లోనూ తనిఖీలు కొనసాగుతా యని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు.
యథేచ్చగా ఉల్లంఘన...
బుధవారం నుంచి నగరంలో స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. దీంతో మళ్లీ రోడ్లపై పాఠశాలలకు విద్యార్థులను తరలించే బస్సులు, ఆటోలు, వ్యాన్ల హడావుడి ఎక్కువైంది. అనివార్య కారణాల నేపథ్యంలో అత్యధికంగా విద్యార్థులు స్కూళ్లకు ఆటోల్లోనే వెళుతుంటారు. నిబంధనల ప్రకారం వీటిలో ఆరుగురు విద్యార్థులను మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉన్నా... అనేక మంది ఆటోడ్రైవర్లు ఎనిమిది నుంచి పది మందిని తరలిస్తున్నారు. దీనిని సీరియస్‌గా పరిగణించిన ట్రాఫిక్ పోలీసులు స్కూల్ వాహనాలపై స్పెషల్‌డ్రైవ్స్ చేపట్టాలని నిర్ణయించారు.
ఆర్టీఏ అధికారుల సాయంతో...
ఇందుకుగాను ఆర్టీఏ అధికారులతో సంయుక్త బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ట్రాఫిక్ పోలీసులు రవాణా శాఖ సంయుక్త కమిషనర్‌ను సంప్రదించగా, ఆయన ఆరుగురు మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్లను (ఎంవీఐ) కేటాయించారు. వీరితో పాటు స్థానిక ట్రాఫిక్ ఏసీపీల నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌లో ఏఎంవీఐ, ట్రాఫిక్ ఎస్సై, ఆర్టీఏ కానిస్టేబుల్‌లతో పాటు ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉంటున్నారు. ప్రధానంగా ఈ బృందాలు స్కూళ్లు తెరిచే, ముగిసే సమయాల్లోనే డ్రైవ్స్ చేపడుతున్నాయి. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వర కు ఆయా స్కూళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రధానంగా ఆరింటిపైనే దృష్టి...
ప్రత్యేకంగా ఏర్పాటైన ఆరు ప్రత్యేక బృందాలు ప్రధానంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తదితర పత్రాలతో పాటు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేయడం, ఓవర్ లోడింగ్, మైనర్ డ్రైవింగ్ అంశాలను పరీక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక బృందాలు త్వరలో స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థులను తరలించే వాహనాల డ్రైవర్లు, తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నిబంధనలు, భద్రత అంశాలపై అవగాహన కల్పించనున్నారు. కొందరు తల్లిదండ్రులు బైక్‌లపై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు తీసుకువస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పరిమితికి మించి చిన్నారుల్ని తీసుకువచ్చే తల్లిదండ్రులకూ అవగాహన కల్పించనున్నారు.
తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి
భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్ కొనసాగిస్తాం. బడి పిల్లల భద్రతలో తల్లిండ్రులతో సహా అంతా భాగస్వాములు కావాలి. ఓవర్‌లోడింగ్ వాహనాల్లో తమ పిల్లలను పంపకూడదు. యాజమాన్యాలతో పాటు వీరు కూడా డ్రైవర్లు, వాహనం స్థితిగతులు, పత్రాలు తనిఖీ చేసుకోవాలి. ఈ తరహా వాహనాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే 9010203626తో పాటు ‘ట్రాఫిక్ లైవ్’ యాప్‌ను వినియోగించుకోవచ్చు. పాఠశాల యాజమాన్యాలు సైతం 2011 మార్చ్ 16న రవాణా శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లోని (జీఓ ఎంఎస్ నెం.35) అంశాలను కచ్చితంగా పాటించాలి.– అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్ చీఫ్
Comments
Please login to add a commentAdd a comment