పెళ్లింట విషాదం | Tragedy of marriage | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Published Thu, May 8 2014 3:53 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

Tragedy of marriage

సిరిసిల్ల టౌన్, న్యూస్‌లైన్ : తెల్లవారితే ఆ ఇంట్లో పెళ్లి. పందిళ్లు... టెంట్లు.. ఇతర ఏర్పాట్లు... బంధువుల కోలాహలంతో అంతా సందడిగా ఉంది. ఇంతలో ఓ తాగుబోతు డ్రైవర్ ఆగడం ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. ఆటోను ఇష్టారాజ్యంగా నడపడంతో ఇంటిముందు వేసిన పందిరితోపాటు పెళ్లికూతురు తండ్రిని ఢీకొట్టగా అతడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం... సిరిసిల్ల పట్టణంలోని తారకరామనగర్‌కు చెందిన వేముల పుండరీకం(50) నేత కార్మికుడు. భార్య జమున బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు కాగా.. పెద్దకుమార్తెకు పెళ్లయింది. రెండోకూతురు అశ్విని వివాహం స్థానిక గణేశ్‌నగర్‌కు చెందిన పాముల రాజేందర్‌తో నిశ్చయించారు. గురువారం పెళ్లి. పెళ్లికూతురు ఇంటి ఎదుట పందిరి వేసి బుధవారం అంతా ఏర్పాట్లుచేస్తున్నారు.
 
 ఇంతలో అతిగా మద్యం తాగి టాటా ఏస్ వాహనం(ట్రాలీ ఆటో) నడుపుకుంటూ వచ్చిన ఓ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా పోనిస్తూ పందిరిని ఢీకొట్టాడు. పందిరి కూలడంతో ఇంట్లో ఉన్న పుండరీకం బయటకు వచ్చి డ్రైవర్‌ను నిలదీసే ప్రయత్నం చేశాడు. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ వాహనాన్ని వెనకకు తీస్తూ పుండరీకంపైనుంచి పోనిచ్చాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని చూసిన డ్రైవర్ వెంటనే అక్కడినుంచి ట్రాలీతో సహా పారిపోయాడు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. పీటలదాకా వచ్చిన అశ్విని పెళ్లి జరిపే విషయం పెద్దలు చర్చిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement