ఏమవుద్దో..! రవాణాశాఖ ఉద్యోగుల్లో టెన్షన్‌ టెన్షన్‌  | Transfers And Promotions In Telangana Transport Department | Sakshi
Sakshi News home page

Published Sun, May 27 2018 7:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Transfers And Promotions In Telangana Transport Department - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ పదోన్నతి పొందాలన్న కోరిక ఉంటుంది. వారి సర్వీసును బట్టి ఇవ్వాలి కూడా. అయితే రవాణాశాఖలో గత నాలుగైదేళ్లుగా పదోన్నతులు లేక చాలామంది ఉద్యోగులు తమ కల తీరకుండా సర్వీసు నుంచి రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఆర్టీఏ ఉద్యోగుల్లో ఏ ప్రక్రియ ముందు జరుగుతుందో తెలియక టెన్షన్‌ పడుతున్నారు. ఇలా ఎందుకంటే.. నాలుగేళ్లుగా పదోన్నతి కోసం ఎదురు చూసిన ఓ ప్రాంతీయ రవాణా అధికారి చివరకు ఉప రవాణా కమిషనర్‌ పదోన్నతికి నోచకుండానే గతేడాది ఉద్యోగ విరమణ చేశారు. మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఒక ఆర్టీఓకు   డీటీసీగా పదోన్నతి తీసుకొని రిటైర్‌ కావాలని ఉంది. ఆ అవకాశం కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే  సీనియర్‌ ఎంవీఐగా పనిచేస్తున్న మరో అధికారికి మూడేళ్ల క్రితమే ఆర్టీఓగా పదోన్నతి రావాలి.

కానీ ఇప్పటి వరకు ఆ అవకాశం దక్కలేదు. 2012లో  సహాయ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లుగా చేరిన సుమారు 80 మందిలో కనీసం సగం మందికి  ప్రమోషన్‌ ఇవ్వాలి. అనేక కారణాల వల్ల వారంతా విధుల్లో చేరిన వారు చేరినట్లుగానే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చిన నేపథ్యంలో మొదట బదిలీ ప్రక్రియ పూర్తి చేసి తరువాత పదోన్నతులు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదిస్తుండగా, కిందిస్థాయిలో  దానిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొదట పదోన్నతులను పూర్తి చేసిన అనంతరం బదిలీలు చేపట్టాలనే డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ రెండు అంశాల్లో ఏది ముందు పరిగణనలోకి తీసుకుంటుందో తెలియని సందిగ్ధం నెలకొంది. 

అన్ని చోట్ల ఇంచార్జీలే.. 
రాష్ట్ర విభజన అనంతరం ఒకటి, రెండు సార్లు ఉద్యోగుల బదిలీలు జరిగినప్పటికీ పదోన్నతులు మాత్రం లభించలేదు. గత ఐదేళ్లుగా ఎంతో మంది ఆర్టీఓలు, ఎంవీఐలు ఎలాంటి పదోన్నతులకు నోచకుండానే రిటైరయ్యారు. మరెంతోమంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తూనే  ఉన్నారు. రిటైరైన వారి స్థానంలో అక్కడే పనిచేస్తున్న ఇతర కేటగిరీల వారికి ఇన్‌చార్జిలుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం, మలక్‌పేట్, బండ్లగూడ, ఖైరతాబాద్, తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఇన్‌చార్జీలే విధులు నిర్వహిస్తున్నారు. ఎంవీఐలు, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులకు ఆర్టీఓలుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇలా చేరినవారు కూడా చివరకు ఇన్‌చార్జీ హోదాలోనే పదవీ విరమణ చేశారు. కానీ పదోన్నతికి మాత్రం నోచుకోలేదు. మరోవైపు ఇదే సమయంలో చాలాకాలంగా బదిలీలు లేకపోవడంతో ఆర్టీఏలో  ‘ఆన్‌ డిప్యుటేషన్‌’ (ఓడీ) పైన ఇతర కార్యాలయాలకు, చెక్‌పోస్టులకు బదిలీ చేసుకొని వెళ్లిపోవడం ఒక ప్రహసనంగా మారింది. గత నాలుగేళ్లుగా వంద మందికి పైగా వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఇదేవిధంగా వెళ్లారు. ‘పదోన్నతి పొందడం ఒక హక్కు. మూడేళ్లు ఒక హోదాలో పనిచేసిన తరువాత సహజంగానే మరో హోదాకు వెళ్లాలని కోరుకుంటాం. పదవీ విరమణ నాటికి లభించే ప్రయోజనాలు కూడా అదనంగా ఉంటాయి.

వీటన్నింటికీ తోడు ఉన్నత హోదాలో రిటైర్‌ కావడమనేది జీవితంలో ఒక సంతృప్తి’ అని నగరంలో పనిచేస్తున్న ప్రాంతీయ రవాణా అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏడుగురు ఆర్టీఓలకు ఉప రవాణా కమిషనర్లుగా, మరో 15 మంది ఎంవీఐలు లేదా పరిపాలన అధికారులకు ప్రాంతీయ రవాణా అధికారులుగా పదోన్నతి రావాలి. ఇక ఎంవీఐలుగా పదోన్నతులు పొందవలసిన సహాయ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇలా చేరిన వారు 2012లో  80 మంది ఉంటే, 2014, 2016లో మరో వంద మందికి పైగా ఉన్నారు. ఇక జూనియర్, సీనియర్‌ క్లర్క్‌లుగా పనిచేస్తున్న వాళ్లు సూపరింటెండెంట్‌ పదోన్నతుల కోసం తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు.  

ముందు ఏ ప్రక్రియ ఉంటుందో..!  
మొదట బదిలీలు చేపటి తరువాత పదోన్నతులు ఇవ్వాలనే ప్రతిపాదన పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బదిలీ చేసిన తరువాత పదోన్నతి ఇవ్వడం వల్ల గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఆర్టీఏ ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉదాహరణకు ఒక మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఏదో ఒక ఆఫీస్‌కు బదిలీ చేస్తే సదరు వ్యక్తికే ఆర్టీఓగా పదోన్నతి లభించి మరో చోటకు వెళ్లాల్సి రావచ్చు. అలా వెళ్లినప్పుడు ఎంవీఐ స్థానం ఖాళీ అవుతుంది. అలాగే పరిపాలనాధికారులను మొదట వివిధ చోట్లకు బదిలీ చేస్తే తరువాత వారిలో కొందరికి పదోన్నతులు లభించినప్పుడు మరోసారి పరిపాలనాధికారులను నియమించకతప్పదు. లేదా తిరిగి ఇంచార్జీలకే బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది.  ఇలా పదోన్నతుల కంటే ముందు బదిలీలు చేయడం వల్ల సాంకేతికంగా ఇబ్బందులు వస్తాయని ఉందని వివిధ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.  

ఓడీలకు తెరపడేనా.. 
బదిలీలు లేకపోవడం వల్ల గత నాలుగేళ్లుగా ఆన్‌ డిప్యుటేషన్‌ బదిలీలు పెద్ద ఎత్తున సాగాయి. ఎంవీఐలు, ఇతర కేటగిరీల్లో పనిచేస్తున్న వారు తమకు నచ్చిన ఆఫీసులకు, చెక్‌పోస్టులకు బదిలీ చేయించుకొని వెళ్లారు. నిబంధనల మేరకు సాధారణంగా జరగాల్సిన బదిలీలకు ఆన్‌ డిప్యుటేషన్‌ ఒక ప్రత్యామ్నాయంగా మారింది. తాజాగా ప్రభుత్వం బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో రవాణాశాఖలో ఈ విధానానికి తెరపడే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement