ఆబ్కారీ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం
ఎస్‌ఐ నుంచి ఏఈఎస్ వరకు స్థానచలనం
ఒక జిల్లాలో పనిచేసిన వారిని మరో జిల్లాకు బదిలీ చేసే అవకాశం
మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న కమిషనర్
వచ్చే నెలలోనే బదిలీలు ఉంటాయన్న మంత్రి పద్మారావు గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ శాఖలో మూడేళ్ల తరువాత బదిలీలకు రంగం సిద్ధమైంది. రెండేళ్లకోసారి బదిలీలు జరగాల్సిన ఎక్సైజ్ శాఖలో గత మూడేళ్లుగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్‌ఐ నుంచి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఏఈఎస్)ల వరకు గత మూడేళ్లకు పైగా ఆయా చోట్లలో పాతుకుపోయారు. బదిలీల గురించి ఉద్యోగ, అధికారుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నా, రాష్ట్ర విభజన, ఉద్యోగుల విభజన తదితర కారణాలతో ముందుకు కదలలేదు.
అయితే కమలనాథన్ కమిటీ ఎక్సైజ్ శాఖలో రాష్ట్ర స్థాయి పోస్టుల విభజన పూర్తిచేసిన నేపథ్యంలో బదిలీల ఫైలుకు మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. నవంబర్ నెల మొదటి వారం నుంచి బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలిసింది.
40 శాతం ఉద్యోగుల బదిలీలు
ఎక్సైజ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఐ నుంచి ఏఈఎస్‌ల వరకు సుమారు 800 మంది వరకు విధుల్లో ఉన్నట్లు అంచనా. మూడేళ్లుగా బదిలీలు జరగనందు వల్ల ఈసారి 40 శాతం వరకు ఉద్యోగుల బదిలీ తప్పకపోవచ్చని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే డిసెంబర్ నెలను కటాఫ్‌గా నిర్ణయించి అప్పటికి ఆయా స్థానాల్లో మూడేళ్లు సర్వీస్ పూర్తయిన వారిని బదిలీల కేటగిరీలోకి తీసుకోనున్నారు. బదిలీల విధానంలో కొన్ని మార్పులు కూడా తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది.
‘మంచి’ జిల్లాలుగా పేరున్న చోట్ల ప్రస్తుతం పనిచేస్తున్న వారిని వేరే జిల్లాకు బదిలీ చేయాలనేది అందులో ఒకటి. ఉదాహరణకు రాష్ట్రంలో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఆదాయంలో మొదటి స్థానం (ఏ- కేటగిరి)లో ఉంది. ఈ జిల్లాలోని ఏదో ఒక స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐని అదే జిల్లాలోని మరోస్టేషన్‌కు మార్చడం వల్ల హైదరాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లోని అధికారులు ‘మంచి’ జిల్లాకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక జిల్లాలో పనిచేస్తున్న వారిని మరో జిల్లాకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే బదిలీల్లో రెవెన్యూ అధికంగా సాధించి పెట్టిన స్టేషన్ అధికారిని ఏ కేటగిరీ స్టేషన్‌ను కేటాయించడం,
తరువాత స్థానాల్లో ఉన్న వారిని బీ,సీ కేటగిరీలకు పంపడం ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రెవెన్యూతో పాటు గుడుంబా, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టిన వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో ఏ స్టేషన్ నుంచైనా ఇతర జిల్లాలతో పోలిస్తే రెవెన్యూ అధికంగానే ఉంటుంది. రెవెన్యూకే ప్రాధాన్యం ఇస్తే ఏ కేటగిరీలో ఈ ఒక్క జిల్లాలో పనిచేసిన వారికే ప్రాధాన్యం లభిస్తుంది. ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పనిచేసిన వారు డీ- కేటగిరీలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూతో పాటు నమోదైన నేరాలు, కేసులను కూడా పరిగణనలోకి తీసుకొని బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.