
ఆంధ్ర అధికారుల బదిలీలు షురూ
భద్రాచలం : జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన ఉన్నత స్థాయి అధికారుల బదిలీల పర్వం వేగవంతమైంది. కీలక పోస్టుల్లో తెలంగాణకు చెందిన అధికారులే పనిచేసేలా చర్యలు చేపట్టిన రాష్ట్రప్రభుత్వం రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ హోదా గల ఏడుగురు అధికారులను బదిలీ చేసింది. మంగళవారం ఈ మేరకు జీవో నంబర్ 6 పేరుతో ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేసింది. దీనిలో భాగంగా భద్రాచలం, పాల్వంచ ఆర్డీవోలు కాసా వెంకటేశ్వర్లు, ఎన్.సత్యనారాయణలను బదిలీ చేస్తూ... ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో ప్రత్యే క ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న ఆర్.అంజయ్యను భద్రాచలం ఆర్‌డీవోగా బదిలీ చేశారు.
అందరి మన్ననలు పొందిన వెంకటేశ్వర్లు
భద్రాచలం ఆర్‌డీవోగా కాసా వెంకటేశ్వర్లు 2013 డిసెంబర్ 4న బదిలీపై వచ్చారు. గతంలో భద్రాచలం తహశీల్‌దార్‌గా పనిచేసిన అనుభవం దృష్ట్యా శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈ ఏడాది జరిగిన ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంలో ఆర్‌డీవో వెంకటేశ్వర్లు పాత్రను ప్రముఖంగా చెప్పవచ్చు. అన్ని శాఖల అధికారులను సమన్వయ పరిచి, ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ చిన్నపాటి లోపాలు కూడా లేకుండా విజయవంతం చేయించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.