సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు ప్రభుత్వం ఆమోదిస్తేనే చేపడతామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ విద్యా కమిషనరేట్‌లో బోర్డు విద్యా కమిషనర్ అశోక్ మాట్లాడారు. అలాగే విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. లెక్చరర్ల సాధారణ బదిలీల కారణంగా ఇబ్బందిపడ్డ 292 మందికి బదిలీలు నిర్వహించామని, మిగతా వారూ బదిలీలు కావాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
దీనిపై ప్రభుత్వానికి లేఖ రాశామని.. ప్రభు త్వ నిర్ణయం వెలువడాల్సి ఉందని చెప్పారు. గతే డాది ఇంటర్ ఫస్టియర్‌లో 94 వేలమంది చేరగా.. ఈసారి ఇప్పటివరకు92 వేల మంది వరకు చేరినట్లు తెలిపారు. ప్రవేశాల్లో విద్యార్థులు సంఖ్య తగ్గలేదని వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1.81 లక్షలమంది విద్యార్థులకు ఆగస్టు 15నాటికి మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భోజనం తీసుకురావడం, వడ్డించడం, విద్యార్థులు తిన్నాక శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను మొత్తంగా గంటలో పూర్తిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 3న అక్షయపాత్ర ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం ఉందని, ఏయే వంటలను ఏ రోజుల్లో అందించాలన్న దానిపై స్పష్టత వస్తుందని వివరించారు.
దరఖాస్తు చేసుకుంది 20 హాస్టళ్లే..
జూనియర్ కాలేజీల్లో హాస్టళ్లను నిర్వహిస్తున్న 600 కాలేజీల్లో ఇప్పటివరకు 20 కాలేజీలు మాత్రమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయని అశోక్ తెలిపారు. హాస్టల్ నిర్వహిస్తున్న ప్రతి కాలేజీ దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు 63 కాలేజీలు ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా లేవని, అవన్నీ ఆయా కాలేజీలను మరో భవనాల్లోకి మార్చుకోవాల్సిందేనని చెప్పారు. జూనియర్ కాలేజీల్లో ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ఆదేశాలిస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని వెల్లడించారు.
ఆగస్టు నుంచి జేఈఈ, నీట్ శిక్షణ..
రాష్ట్రంలోని కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు వచ్చే నెల నుంచి జేఈఈ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అశోక్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఒక జూనియర్ కాలేజీని ఎంపిక చేసి, అందులో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని తెలిపారు.
ఇంటర్ ఫస్టియర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను (జేఈఈకి 50 మంది లేదా 30 మంది, నీట్‌కు 50 మంది లేదా 30 మంది) ఎంపిక చేసి శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. వారికి అక్కడే నివాస వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment