గిరిజన యువతి కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్
Published Mon, Mar 13 2017 10:37 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
ఆసిఫాబాద్ : పెళ్లి పేరుతో గిరిజన యువతులను కిడ్నాప్ చేసి మహారాష్ట్రలో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొంత కాలంగా ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి ఓ ముఠా అనేకమంది అమాయక యువతులను డబ్బుల ఎరజూపి పక్క రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని బనార్‌గోంది గ్రామానికి చెందిన గిరిజన యువతి ఈ నెల 16 నుంచి కనిపించడం లేదు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు పట్టణంలోని చెక్‌పోస్టు కాలనీకి చెందిన హీనా అనే మహిళ బాధిత గిరిజన యువతికి మాయమాటలు చెప్పి బ్రోకర్ల సహాయంతో గుజరాత్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తికి రూ.60వేలకు విక్రయించింది.
జిల్లా కేంద్రంలోని చెక్‌పోస్టు కాలనీలో యువతుల అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానం వచ్చిన ఎస్‌హెచ్‌వో సతీశ్‌కుమార్ విచారణ ప్రారంభించారు. కాలనీకి చెందిన హీనాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, పొరుగురాష్ట్రంలోని చంద్రపూర్‌లో బాధితురాలు ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులు సుజాత, సరిత, శారద, శ్రావణ్, దివాకర్, విమల, గోకుల్‌దాస్, మహేశ్‌లను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. పెళ్లి కొడుకు శంకర్ సాహు, అతనికి సహకరించిన సుధాకర్, రమేశ్‌లను అదుపులోకి తీసుకోవాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. డీఎస్పీ భాస్కర్, సీఐ సతీశ్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement