కౌలు కష్టాలు | Trouble in the Farmers lease | Sakshi
Sakshi News home page

కౌలు కష్టాలు

Published Sat, Jun 21 2014 4:01 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కౌలు కష్టాలు - Sakshi

కౌలు కష్టాలు

రుణఅర్హత కార్డుల ఊసెత్తని రెవెన్యూ అధికారులు
అమలుకు నోచని కౌలుదారుల చట్టం
రుణాల మంజూరుకు బ్యాంకర్ల నిరాసక్తత
 అప్పులతో నష్టపోతున్న కౌలురైతులు     
   
 
 కౌలు రైతులను కష్టాలు వీడడం లేదు. వ్యయప్రయాసలకోర్చి సాగు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందడం లేదు. కౌలురైతులకోసం రూపొందించిన చట్టం అమలును అధికార యంత్రాంగం విస్మరించింది. ఫలితంగా రుణాలు, రాయితీలు పొందలేక వారు అప్పులపాలవుతున్నారు.
 
కరీంనగర్ అగ్రికల్చర్  : కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏపీ ల్యాండ్ లెసైన్స్‌డ్ కల్టివేటర్స్ ఆర్డినెన్స్-2011 చట్టాన్ని తీసుకువచ్చింది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి, వారికి రుణాలు, సబ్సిడీలు అందించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. జిల్లాలో సుమారు 50 వేల మంది కౌలు రైతులున్నారు. ఇతర రైతుల వద్ద నుంచి భూమి కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటున్నారు. 2011-12లో పథకం ప్రారంభించినప్పుడు 29వేలకుపైగా కౌలు రైతులనుంచి దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 15,857 మందికి కార్డులు జారీ చేయగా కేవలం 3519 మందికే రూ.85 కోట్ల మేర రుణాలు ఇచ్చారు. 2012-13లో 13,554 మం ది కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందు లో 3,884 మంది పాతకార్డుదారులు రెన్యూవల్ చేసుకున్నారు. మొత్తంగా 10,004 మందికి కార్డులు ఇచ్చారు. రెన్యూవల్ చేసుకున్నవారితో పాటు కొత్తదార్డుదారులకు కలిపి 3,680 మందికి రూ.85 కోట్లు రుణాలిచ్చారు. 2013-14లో 11,327 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 2,240 మంది రెన్యూవల్ చేసుకోగా 8,086 మంది కొత్తగా రుణ అర్హతకార్డులు ఇచ్చారు. మొత్తం 10,326 మందికి రుణ అర్హతకార్డులు ఇచ్చారు. వీరిలోం చి 2,088 మందికే రూ.71.8 కోట్లు రుణం మంజూరు చేశారు. ఏడాదికేడాదికి ఈ సంఖ్య తగ్గిపోతోంది.

సమన్వయలోపం

కౌలురైతుల గుర్తింపు, రుణ అర్హత కార్డుల జారీ, రుణాలు మంజూరు చేయించే బాధ్యతను రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో చేపట్టాల్సి ఉన్నా రెండుశాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రుణాల మంజూరులో బ్యాంకర్లు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. గ్రామసభల ద్వారా స్థానిక రెవెన్యూ అధికారులు కౌలు రైతులను గుర్తించి, రుణ అర్హత కార్డులను మంజూరు చేయాలి. ఈ కార్డుకు ఒక ఆర్థిక సంవత్సరం పరిమితి ఉంటుంది. ఏప్రిల్‌లో దరఖాస్తులు స్వీకరించి జూలై నెల వరకు కార్డుల పంపిణీ పూర్తి కావాలి. గుర్తించిన కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. మొత్తం ప్రక్రియలో వ్యవసాయశాఖ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో కౌలు రైతులు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చుకుంటూ అధికవడ్డీలు కడుతూ నష్టపోతున్నారు.

అన్నీ సందేహాలే..

ఈ చట్టంపై మొదటినుంచి సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో కౌలురైతులతోపాటు భూ యజమానుల్లోనూ అయోమయం నెలకొంది. సాధారణంగా జూన్ నెలలో కౌలు ఒప్పందం జరుగుతుంది. దానికనుగుణంగా భూయజమానులు అంగీకరిస్తే కౌలు రైతులు రుణ అర్హత కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కౌలు రైతును గుర్తిస్తే తమకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనని భూయజమానులు ఆందోళన చెందుతున్నారు. భూమిని వరుసగా 12 ఏళ్లపాటు ఎవరైనా సాగు చేస్తే వారి సొంతమవుతుందనే అనుమానం భూయజమానులను పీడిస్తోంది. రుణ అర్హత కార్డు వచ్చాక భూయజమాని కాన్సెంట్ ఇస్తేనే బ్యాంకు వారు రుణం మంజూరు చేస్తారు. దీంతో కౌలు రైతులు రుణం కట్టకపోతే అది ఎక్కడ తమకు చుట్టుకుంటుందోననే భయం కూడా యజమానులకు ఉంది. దీనిపైనా స్పష్టత లేదు. రాయితీలు, రుణమాఫీలు వస్తే కౌలుదారులకు వెళ్తాయా? లేక యజమానులకు వెళ్తాయా? అనే విషయంలోనూ రైతుల్లో అనుమానాలున్నాయి. దీంతో కౌలుకు ఇచ్చినట్లు వీరు ఎలాంటి ఒప్పందం చేయకపోవడంతో చాలా మంది కౌలు రైతులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.

గతంలో ఇచ్చిన రుణ అర్హత కార్డులపై బ్యాంకు రుణాలు అందకపోవడం కూడా ఓ కారణమవుతోంది. రుణఅర్హతకార్డులున్న రైతులకు మూడేళ్లుగా వరుసగా 22 శాతం, 36 శాతం, 20 శాతం మందికే రుణాలు మంజూరయ్యాయి. సందేహాలను నివృత్తి చేసి రుణాలు మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు కౌలురైతుల గుర్తింపు ప్రక్రియ మొదలు కాలేదు. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో కౌలురైతులు తమ కష్టాలు తీరుతాయని ఆశపడుతున్నారు. కౌలు రైతులను గుర్తించేందుకు వెంటనే షెడ్యూల్ ప్రకటించి, యజమానుల అంగీకారం లేకుండా అందరికీ బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement