
నేడు టీఆర్‌ఎస్ 14వ ఆవిర్భావ సభ
* 10 లక్షల మందితో జన సమీకరణ!
* 4 వేల మంది పోలీసులతో బందోబస్తు
* భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 14వ ఆవిర్భావ సభ సోమవారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరగనుంది. పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న సభ కావడంతో టీఆర్‌ఎస్ నాయకత్వం ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మునుపెన్నడూ లేని రీతిలో 10 లక్షల మంది ప్రజలను సభకు సమీకరించనుంది. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి కనీసం లక్ష మందిని సమీకరించే బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు సీఎం కేసీఆర్ అప్పగించారు. దీనిపై ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల నాయకులతో చర్చించిన కేసీఆర్...శనివారం తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మందిని సమీకరించాలని లక్ష్యం నిర్దేశించారు. ఆదివారం రాత్రి కూడా కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమై బహిరంగ సభ ఏర్పాట్లు షెడ్యూలుపై చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ పార్టీ నిర్వహించనంత భారీగా సభను నిర్వహించాలనుకుంటున్నట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు.
పార్టీ భవిష్యత్ ప్రణాళిక ఆవిష్కారం...
అధికార పార్టీ హోదాలో రాష్ట్ర ప్రజానీకానికి ఏం చేయబోతున్నారో సీఎం కేసీఆర్ ఈ సభా వేదిక నుంచి భరోసా ఇస్తారని పార్టీ నాయకత్వం పేర్కొంది. వాస్తవానికి ప్లీనరీలో ప్రవేశ పెట్టిన తీర్మానాల ద్వారా ఇప్పటికే ఒక సందేశం ఇచ్చామని, బహిరంగ సభ ద్వారా మరింత స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు సీఎం ఓ సందేశం ఇస్తారని అంటున్నారు. ప్రధానంగా పార్టీ యంత్రాంగం ద్వారా ఏం చేయనున్నామో తెలుపుతారని పేర్కొంటున్నారు. ‘కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా ప్లీనరీలో విపక్షాల జోలికి పెద్దగా వెళ్లలేదు. ఆయా పార్టీల విమర్శలనూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, బహిరంగ సభ ద్వారా విపక్షాల నోళ్లు మూయించేందుకు సమాయత్తం అవుతున్నారు’ అని పార్టీ నేత ఒకరు తెలిపారు. ప్రధానంగా 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా ఈ సభ ద్వారా పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తారని విశ్లేషిస్తున్నారు. కనీసం నూరు సీట్లు లక్ష్యంగా, ఇప్పటి నుంచే పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తించారని, ముఖ్యనేతల భేటీలోనూ ఈ అంశాన్ని చర్చించారని చెబుతున్నారు.
సభకు 5 వేల ఆర్టీసీ బస్సులు!
భారీ జనసమీకరణ లక్ష్యంగా టీఆర్‌ఎస్ నేతలు ఆర్టీసీ బస్సులను ఎడాపెడా బుక్ చేసేశారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఆదివారం రాత్రి వరకు దాదాపు ఐదు వేల వరకు బస్సులు బుక్ అయినట్లు తెలిసింది. తొమ్మిది జిల్లాల్లో ప్రస్తుతం 6,500 ఆర్టీసీ బస్సులుండగా... టీఆర్‌ఎస్ నేతలు ఏకంగా 5 వేలకుపైగా బస్సులను బుక్ చేసుకోవడంతో సాధారణ ప్రయాణికులకు సోమవారం ఇబ్బందులు తప్పేలా లేవు. సాధారణంగా ఇలాంటి బహిరంగ సభలకు 30 శాతం నుంచి 40 శాతం వరకు మాత్రమే బస్సులను కేటాయించిన దాఖలాలున్నాయి. కానీ ఈ సభకు జనసమీకరణ విషయంలో నేతలకు కచ్చితమైన లక్ష్యాలు విధించటంతో వారు ఇష్టారీతిన బస్సులను బుక్ చేసుకున్నారు. కాగా, సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వల్ల కొన్ని సిటీ సర్వీసులు వృథాగా డిపోలకే పరిమితం కావొచ్చని అంచనా వేసిన అధికారులు ఆదివారం రాత్రి వరకు ఐదొందల సిటీ బస్సులను జిల్లాలకు కేటాయించారు.
భారీ స్థాయిలో బందోబస్తు...
ఇటీవల సంచలనం సృష్టించిన సిమి ఉగ్రవాదుల కాల్పుల ఘటనల నేపథ్యంలో సభకు ఏకంగా 4 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ప్రవేశించే ప్రధాన మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. పది జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం 23 స్థలాలను గుర్తించారు.