సాక్షి, హైదరాబాద్ : కొడంగల్ అసెంబ్లీ నియో జకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైతే.. దీటుగా ఎదుర్కొనేందుకు అధికార టీఆర్‌ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవలే టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మారే ముందే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ పేరున రాసి టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబుకు అందజేశారు. ఆ లేఖ ఇంకా శాసనసభ స్పీకర్‌కు అందలేదు. ఒకవేళ రాజీనామా లేఖ అంది, ఆమోదం పొందితే.. ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ నాయకత్వం పోరుకు ముందస్తుగానే సన్నద్ధమ వుతోంది. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీశ్‌రావుకే కొడంగల్ బాధ్యతలు కూడా అప్పగించింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. కొడంగల్‌కు ఉపఎన్నిక తప్పనిసరైతే హరీశ్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరి స్తారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కొడంగల్ ఉప ఎన్నిక నుంచే శంఖారావం పూరిస్తామని టీఆర్‌ఎస్ నేతలు ఇటీవల చేసిన ప్రకటన ఉప ఎన్నికకు వారి సన్నద్ధతను స్పష్టం చేస్తోంది.
పరకాల ప్రయోగం
ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లా పరకాల నియోజ కవర్గానికి జరిగిన ఉపఎన్నిక అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ పడ్డారు. ఆ ఎన్నికను సవాలుగా తీసుకున్న టీఆర్‌ఎస్ నాయకత్వం.. హరీశ్‌కు బాధ్యతలు అప్పజెప్పి, తమ అభ్యర్థి మొలుగూరి భిక్షపతిని గెలిపించుకుంది.
గ్రామస్థాయి మొదలు నియోజక వర్గం దాకా బాధ్యతల పంపకం, శ్రేణుల మోహరిం పు, ప్రచారంలో వినూత్న పోకడలతో టీఆర్‌ఎస్ పరకాల ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అదే తరహా ప్రణాళిక, వ్యూహాలనే ఇప్పుడు కొడంగల్ ఉప ఎన్నికలో అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. గ్రామగ్రామాన సమస్యలను గుర్తిం చడం, ప్రజల తక్షణావసరాలు తీర్చడం ద్వారా వారిలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు.
ఇందుకోసం ఒక్కో గ్రామానికి ఒక ఎమ్మెల్యేను రంగంలోకి దింపాలని.. ఒక్కో మండలం బాధ్యతను ఒక మంత్రికి, పదిహేను గ్రామాలకో ఎంపీ స్థాయి నేత సేవలు ఉపయోగించుకోవాలని ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక గ్రామాల్లో కులాల వారీగా ఓటర్ల లెక్కలు తీసి.. ఆ కులానికే చెందిన మంత్రి లేదా, ఎమ్మెల్యేతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
స్థానిక ప్రజాప్రతినిధుల సేవలు కూడా..
నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధుల సేవలు వినియోగించుకోవాలని అధికారపార్టీ నిర్ణయించింది. ఇప్పటికే మండలాల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు సభ్యుల ఫోన్ నంబర్లు, వివరాలను సేకరించారు.
వారితో నేరుగా హరీశ్‌రావు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితిని అంచనా వేసేలా, తక్షణ నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధికి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డితో ఇప్పటికే పలుమార్లు హరీశ్ భేటీ అయ్యారని.. అందులో భాగంగానే కాంగ్రెస్, టీడీపీ నుంచి వలసలు పెరిగాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment