హాట్ సీటు!
రెండో స్థానానికి టీఆర్‌ఎస్‌లో పోటాపోటీ
రేసుగుర్రాలపై స్థానికంగా అసంతృప్తి
అభ్యర్థుల ఖరారుపై వ్యూహాత్మక మౌనం
నరేందర్‌కు సీటు దాదాపు ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి అభ్యర్థులను ప్రకటించకుండా టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థి బలాబలాలను బేరీజు వేసుకున్న తర్వాతే అభ్యర్థులను ఖరారుచేసే అంశాన్ని గులాబీ అధినాయకత్వం పరిశీలిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 9న నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రేసుగుర్రాల ప్రకటనకు మరో ఒకట్రెండు రోజుల సమయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి గులాబీ బాస్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండో సీటుకు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు కూడా మొదటి సీటు జోలికి వెళ్లకుండా.. రెండో స్థానానికి తమ పేరును పరిశీలించాలని అభ్యర్థిస్తుండడం చూస్తే ‘పట్నం’కు టికెట్ ఖాయం అయినట్లు భావించాల్సివస్తోంది. అధిష్టానం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ, నరేందర్‌రెడ్డి మాత్రం కొంతకాలం స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు కూడగట్టే ప్రయత్నం కొనసాగిస్తున్నారు.
నిధుల కేటాయింపు, ఇతరత్రా అభివృద్ధి పనుల మంజూరులో కీలకభూమిక పోషిస్తూ ఎంపీటీసీలతో సత్సంబంధాలను ఏర్పరుచుకున్నారు. మరోసారి ఎమ్మెల్సీగా బరిలో ఉంటాననే ముందుచూపుతో నరేందర్.. ముందస్తు వ్యూహాన్ని అమలు పరిచినట్లు తెలుస్తోంది. అయితే, ఈయన అభ్యర్థిత్వాన్ని పార్టీలో ఒకవర్గం అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, హైకమాండ్ ఆదేశాలను శిరసా వహిస్తామని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పట్నం అభ్యర్థిత్వానికి ప్రతిబంధకాలు ఉండకపోవచ్చు.
రెండో సీటుపైనే గురి!
ఒక స్థానానికి నరేందర్ అభ్యర్థి దాదాపుగా ఖరారైందని ప్రచారం జరుగుతున్న తరుణంలో రెండో సీటునుంచి పోటీ చేసేందుకు ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమదైన శైలిలో పావులు కదుపుతూ అధినాయకుల ఆశీస్సుల కోసం చక్కర్లు కొడుతున్నారు. రెండో సీటు ఖరారులో సామాజిక సమతుల్యత, ఆర్థిక వనరులను పరిగణనలోకి తీసుకుంటారని ఆశావహులు భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శంభీపూర్ రాజు, పార్టీ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, సీనియర్ నేతలు రాగం నాగేందర్‌యాదవ్, సామల వెంకటరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో రేసుగుర్రాలెవరనే అంశంపై మాత్రం ముఖ్యనేతలు నోరుమెదపడంలేదు.
పెద్దల సభకు అనుభవజ్ఞులను రంగంలోకి దింపాలని ఇప్పటికే కొందరు అగ్రనాయకులు అధిష్టానం దృష్టికి తెచ్చారు. జిల్లా సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహనలేకుండా అభ్యర్థులను బరిలో దింపడం వల్ల నష్టం జరుగుతుందని సీఎంకు స్పష్టం చేశారు. మరోవైపు రెండో స్థానంపై కన్నేసిన మాజీ కార్పొరేటర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులోభాగంగా శుక్రవారం కొంతమంది స్థానిక సంస్థల ప్రతినిధులతో రహాస్య సమావేశం నిర్వహించారు. యువతకు అవకాశం కల్పించాలని భావిస్తే రాజకీయ అనుభవం ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
ఇలా ఎవరికివారు రెండో సీటుపై గురి పెట్టడంతో ఈ స్థానానికి అభ్యర్థిని ఖ రారు చేయడం అధిష్టానానికి ఒకింత తలనొప్పిగా మారింది. ఇదిలావుండగా, రేసుగుర్రాలపై మాత్రం స్థానిక నాయకత్వంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి సీటు కేటాయించడమేకాదు.. అందరినీ సమన్వయం చేయడం పార్టీకి పెద్ద సవాలు కానుంది.