జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది.
సర్కారు స్కూళ్లలో సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
24వ తేదీ నుంచి అమలు చేయాలని అధికారుల కసరత్తు
ఉపాధ్యాయులు లేదా వీఆర్‌ఏలకు పర్యవేక్షణ బాధ్యతలు
తల్లిదండ్రులు వలసవెళ్లిన పిల్లలకు మరింత ప్రయోజనం
ఎండల దృష్ట్యా ఉదయం 10గంటలకే పెట్టాలని యోచన
మహబూబ్‌నగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై కలెక్టర్, ఇతర ఉన్నతస్థాయి అధికారులు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి ప్రణాళికలు రూపొందించారు. పాఠశాలల పనివేళల్లో మధ్యాహ్న భోజనం వినియోగించుకుంటున్న వారితో పాటు ఈ వేసవిలో ఎంతమంది విద్యార్థులు వినియోగించుకుంటారనే అంశంపై అంచనా వేస్తున్నారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో పేద విద్యార్థులకు భోజనం పెట్టడం ద్వారా వచ్చే విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదివరకే పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పర్యవేక్షణ బాధ్యతలను వీఆర్‌ఏ, వీఆర్‌ఓలకు అప్పగించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసిన నేపథ్యంలో వారిని భాగస్వాములు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంటలు చేసే బాధ్యతలను వంట ఏజెన్సీలకే అప్పగించాలని నిర్ణయించారు.
2.50 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
జిల్లాలోని 3800 ప్రభుత్వ పాఠశాలల్లో పనిదినాల్లో 1నుంచి 8వ తరగతి వరకు 3.68లక్షల మంది విద్యార్థులు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల్లో కేవలం 65శాతం మంది వరకు అంటే సుమారు 2.50లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ నిధులతో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. అలాగే 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు తరగతుల్లోనూ సుమారు 69వేల మందికిపైగా విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. ఈనెల 24వ తేదీ వేసవిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ రాంకిషన్ ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో తాము భాగస్వాములు అవుతామని ప్రకటించారు.
పేద విద్యార్థులకు ఉపశమనం
వేసవి సెలవుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న మ ధ్యాహ్న భోజనం పథకం ద్వారా పేద విద్యార్థులకు కొంత ఉపశమనం కలగనుంది. అదే విధంగా తల్లిదండ్రులు వలసలు వెళ్లి వృద్ధులతో ఉంటున్న చి న్నారులకు ఉపయోగకరంగా ఉంటుంది. వేసవి ఉ ష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 10గంటలకే భోజనం పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇంకా స్పష్టత రాలేదు
జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలుచేయనున్నాం. ఎప్పటినుంచి అమలు చేయాలి.. పర్యవేక్షకులుగా ఎవరిని నియమించాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ నుంచి ఆదేశాలు రాగానే అమలుచేస్తాం. - విజయలక్మీ బాయి, డీఈఓ