సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న కె.కేశవరావు. చిత్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి తలసాని, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మంత్రులు, వివిధ శాఖల అధికారులు భారీగా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తమ పెద్ద కొడుకుగా భావిస్తూ రాష్ట్ర ప్రజలు సీఎం 66వ పుట్టిన రోజును పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా శాసనసభలో జరిగిన పలు కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి దంపతులతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. శాసనసభ, శాసనమండలిలో విధులు నిర్వహిస్తున్న 280 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సతీమణి పుష్ప, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సతీమణి అరుంధతి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్ సెంటర్ (జిమ్)ను స్పీకర్, మండలి చైర్మన్ కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా లాంగ్ లివ్ కేసీఆర్ అనే నినాదం ముద్రించిన గులాబీ రంగు టీ షర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సందడి చేశారు. పలువురు అధికారులు, సంఘాల నేతలు కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
జలవిహార్‌లో ఘనంగా వేడుకలు
నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో 66 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి, 10వేల మందికి విందును ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, బతుకమ్మ, ఒగ్గుడోలు, పులివేషధారణలు, నృత్యాలు, యక్షగానంతో సహా వివిధ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ జీవిత నేపథ్యాన్ని వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రారంభించారు. వికలాంగులకు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ వీల్‌చెయిర్లను పంపిణీ చేశారు.
తెలంగాణ భవన్‌లో...
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో కేసీఆర్ రోల్ మోడల్‌గా నిలుస్తున్నారని శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం జన్మదినం సందర్భంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర దివ్యాంగుల సహకార కార్పొరేషన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి చేతుల మీదుగా 66 మంది దివ్యాంగులకు వీల్‌చెయిర్లు, 66 మంది అంధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రక్తదానం చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో టీఆర్‌ఎస్ నేత దండె విఠల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 150 ప్రవాస భారతీయ కుటుంబాలు మొక్కలు నాటి, స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మొక్కలు నాటిన మంత్రులు
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం అటవీ, ఇతర శాఖల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మొక్కలు నాటారు. మొక్కలు నాటిన వారిలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ రఘువీర్, కెనరా బ్యాంకు జీఎం వీరభద్ర రెడ్డి, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, అటవీశాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ సి.పార్థసారథి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్ పి.సత్యనారాయణరెడ్డి, విభా గాధిపతులు మొక్కలు నాటారు. పో లీస్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం 56,872 మొక్కలను నాటారు.
Comments
Please login to add a commentAdd a comment