ఇది మీకు... అది మాకు ! | TRS Leaders Unhappy To MLA Tickets Use In Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఇది మీకు... అది మాకు !

Published Wed, Sep 12 2018 9:03 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

TRS Leaders Unhappy To MLA Tickets Use In Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ముందస్తు ఎన్నికలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందరి కంటే ముందే సీట్ల ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ఇప్పటికే అసమ్మతి పోరుతో సతమతమవుతోంది. మరోవైపు బలమైన టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టేందుకు విపక్ష పార్టీలన్ని కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేసీ కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాయి. అందుకు అనుగుణంగా పాలమూరు ప్రాంతంలో టీడీపీ మూడు స్థానాలు, తెలంగాణ జన సమితి ఒక స్థా నం కోసం పట్టుబడుతున్నాయి. అయితే రాజకీ య సమీకరణాలు, పార్టీల బలాబలాల నేపథ్యం లో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని భావిస్తున్నా యి. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికి, ఎక్కడెక్కడ సీ ట్లు కేటాయించాలనే విషయంలో మహాకూట మిలోని పార్టీలు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే, ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
 
పాలమూరుపైనే అన్ని పార్టీల కన్ను  
ఈసారి రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పాలమూరు ప్రాంతం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు మార్లు పాలమూరు అంశాన్ని ప్రస్తావించారు. ప్రగతి నివేదన సభతో పాటు పలు వేదికలపై పాలమూరు అభివృద్ధిని చెప్పుకొచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ స్థానాలు గెలుపొందాలని గులాబీ దళపతి వ్యూహ రచన చేస్తున్నారు. అలాగే పాలమూరులో మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈసారి భారీ ఆశలు పెట్టుంది. మెజారిటీ స్థానాలు గెలుపొంది టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ ఇవ్వాలని భావిస్తోంది. అలాగే కాస్త బలమైన ఓటు బ్యాంకు కలిగిన టీడీపీతో పాటు ఉద్యమ నేపథ్యం కలిగిన కోదండరాం నేతృత్వంలోని టీజేసీ, సీపీఐలను కూడా కలుపుకొని పోటీలో నిలవాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టింది.
 
సీట్ల విషయంలో తకరారు 
మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తూనే... కాస్త బలం కలిగిన టీడీపీకి కూడా అవకాశం కల్పించాలని భావిస్తోంది. అదే విధంగా పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితి కూడా ఉమ్మడి జిల్లాలో ఒక స్థానం కేటాయించాలని పట్టుబడుతోంది. ఇది వరకే పలుమార్లు సాగిన ప్రాథమిక చర్చల్లో భాగంగా సీట్ల విషయంలో కొన్ని అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఐదు స్థానాలను సిట్టింగ్‌లకే కేటాయించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో గద్వాల నుంచి డీకే.అరుణ, అలంపూర్‌ నుంచి సంపత్‌కుమార్, వనపర్తి నుంచి జి.చిన్నారెడ్డి, కల్వకుర్తి నుంచి వంశీచంద్‌రెడ్డి, కొడంగల్‌ నుంచి ఎనుముల రేవంత్‌రెడ్డికి బెర్తులు ఖరారు చేశారు.

మిగిలిన సీట్ల విషయంలో సర్దుబాటు చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం పాలమూరు జిల్లాలోనే మూడు సీట్లు కావాలని డిమాండ్‌ చేస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ కోసం జడ్చర్ల, పార్టీ ముఖ్యనేత మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి కోసం వనపర్తి, మరో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కోసం మక్తల్‌ స్థానాలను పట్టుబడుతోంది. అదే విధంగా తెలంగాణ జన సమితి మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానాన్ని రాజేందర్‌రెడ్డి కోసం కోరుతోంది. ఇలా మొత్తం మీద సీట్ల విషయంలోనే తకరారు నెలకొంది.
  
పట్టున్న స్థానాలే ఇవ్వండి... 
కూటమి పొత్తులో భాగంగా టీడీపీ, టీజేసీలు తమకు ఆయా ప్రాంతాల్లో బలమైన పట్టుతో పాటు ఓటు బ్యాంకు ఉన్నట్లు కాంగ్రెస్‌ ముందు లెక్కలు ఉంచాయి. జడ్చర్ల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎర్ర శేఖర్‌ గెలవడంతో పాటు బలమైన ఓటు బ్యాంకు ఉన్నట్లు చెబుతోంది. అంతేకాదు జడ్చర్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీ రెండు దశాబ్దాల కాలంలో ఒక్క ఉప ఎన్నికల్లో మినహా మరే ఇతర ఎన్నికల్లో పోటీ ఇవ్వలేకపోయినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పొత్తులో భాగంగా ఎర్ర శేఖర్‌కు జడ్చర్ల స్థానం కేటాయించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అలాగే వనపర్తి విషయంలో మాత్రం ఎలాంటి పేచీ ఉండటం లేదని ఆయా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి పొత్తులో భాగంగా రావుల చంద్రశేఖర్‌రెడ్డికి అవకాశం ఇస్తే సహకరించేందుకు సిద్ధమేనని తాజా సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి చెబుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

అంతేకాదు వనపర్తి చరిత్రలో వరుసగా రెండు సార్లు ఏ ఒక్క ప్రజాప్రతినిధి గెలిచిన దాఖలాలు లేవు. ఈ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తన మిత్రుడు రావుల పోటీ చేసే అవకాశం వస్తే స్వచ్ఛందంగా పక్కకు తప్పుకునేందుకు  ఆయన నిర్ణయించుకున్నారనే ప్రచారం సాగుతోంది. అలాగే, మక్తల్‌ నియోజకవర్గం విషయంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే మక్తల్‌లో కాంగ్రెస్‌కు ఇన్‌చార్జ్‌లెవరూ లేకపోవడంతో పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ జన సమితి... మహబూబ్‌నగర్‌ పూర్తిగా అర్బన్‌ ప్రాంతం కావడంతో పోటీ చేయాలని భావిస్తోంది.

అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో టీజేసీ పార్టీని బలోపేతం చేయడం కోసం రాజేందర్‌రెడ్డి గట్టిగానే కృషి చేస్తున్నారు. అయితే జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌ స్థానాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్‌ సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా పొత్తులు కలిసినా.. సీట్ల కోసం ఎవరి బలాలు వారు ప్రదర్శిస్తుండడండంతో కొంత అస్పష్టత నెలకొన్నా.. రేపో, మాపో స్ఫష్టత వచ్చే అవకాశముందని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement