దేవరకద్రలో సిద్ధమైన సభావేదిక
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆరు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొనాల్సి ఉండగా.. ప్రతీ సమావేశానికి కేవలం 30 నిముషాల సమయం మాత్రమే కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా నారాయణపేటకు ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ ప్రసంగించిన అనంతరం దేవరకద్రలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇతర జిల్లాలో ఏర్పాటు చేసిన సభలకు కేసీఆర్ బయలుదేరతారు.రి వెళ్లనున్నారు.
హోరెత్తిస్తున్న సభలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభలతో హోరెత్తిస్తున్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఇప్పటి వరకు జిల్లాకు రెండు పర్యాయాలు వచ్చారు. వనపర్తిలో ప్రజా ఆశీర్వాద పేరిట ఉమ్మడి జిల్లా సభ నిర్వహించారు. తాగాజా జడ్చర్లలో ఈనెల 21న ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక నుంచి ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.
అందులో భాగంగా ఆదివారం నారాయణపేట, దేవరకద్రలో పార్టీ అభ్యర్థులు ఎస్.రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అలాగే ఈనెల 27న ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు అయిదు చోట్ల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. కల్వకుర్తి, మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేటల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక మిగిలిన మక్తల్, గద్వాల్, అలంపూర్, నాగర్‌కర్నూల్, కొడంగల్‌ల్లో మలి విడుత ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారు.
నారాయణపేటలో పూర్తయిన ఏర్పాట్లు
నారాయణపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యా హ్నం నారాయణపేటకు రానున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో పూర్తిచేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వద సభకు వేదికను సిద్ధం చేశారు.
నియోజకవర్గంలోని కోయిల్‌కొండ, ధన్వాడ, నారాయణపేట, మరికల్, దామరగిద్ద, ధన్వాడ మండలాల నుంచి ప్రజలు, టీఆర్‌ఎస్ శ్రేణులు హాజరుకానున్నారు. అలాగే, యాద్గీర్ రోడ్డులోని శ్రీపాద్ పొలం దగ్గరలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. కాగా, సీఎం సెక్యూరిటీ టీం బృందం శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.
దేవరకద్రలో..
దేవరకద్ర రూరల్ : దేవరకద్రలో ఆదివారం జరగనున్న టీఆర్‌ఎస్ ప్రచార సభకు ఏర్పాట్లు పూర్త య్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ఆదివారం సభ నిర్వహణకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో వేదిక ఏర్పాటుచేశారు. ఇక్కడ సభా వేదికతో పాటు హెలీప్యాడ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
ఈ మేరకు ఏర్పాట్లను ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, మార్కెట్ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు కొండ భాస్కర్‌రెడ్డి, కొండ శ్రీను, కుర్వ శ్రీను. వెంకటేష్, బాలస్వామి, చల్మారెడ్డి, జకీ, యుగేందర్‌రెడ్డి, రాధాకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment