ఆశీర్వాద సభకు హాజరైన జనం
సాక్షి, పెద్దపల్లి: కరువంటే తెలియని జిల్లాగా అభివృద్ధిచేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హుజూరాబాద్, పెద్దపల్లి అన్నాచెల్లెలాంటి ఊళ్లన్నారు. మానేరు ఎండిపోయి కాల్వశ్రీరాంపూర్, ఓదెల, వీణవంక రైతులు ఏటా అల్లాడిపోతున్నారని.. ఇక ముందు అలాంటి సమస్యలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించిందని గుర్తుచేశారు. మానేరుపై నాలుగుచోట్ల చెక్‌డ్యాంల నిర్మాణాలు జరుగుతున్నాయని .. మరో నాలుగుచోట్ల నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే మానేరు జీవనదిగా మారుతుందన్నారు. ఇప్పటికే వర్షాకాలంలో మిషన్ కాకతీయ ఫలితాలు కనిపించాయన్నారు. వచ్చే రెండేళ్లలో పెద్దపల్లి మానేరు, హుస్సేన్‌మియా వాగులు జలా హా రంగా కనువిందు చేస్తాయన్నారు. గతంలో రైతులు రాత్రి వేళ కరెంట్ కోసం వెళ్లి పాముకాటుకు గురై చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని.. ఇప్పుడు 24 గంటల కరెంట్ సరఫరాలతో ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. ప్రభుత్వం రైతుల సమస్యలతో పాటు ఆడబిడ్డల పెళ్లీలకు అన్నదమ్ములు కూడా ఇవ్వని రీతిలో రూ.లక్ష కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా అందించినట్లు చెప్పారు.
బీజేపీ, మహాకూటమిలపై ఈటల ఆగ్రహం..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 20 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో తెలంగాణ తరహా పథకాలు అమలు చేయలేదని ఈటల మండిపడ్డారు. కల్లబొల్లి మాటలతో ఓట్లకోసం తిరుగుతున్న బీజేపీని నమ్మొద్దన్నారు. మహాకూటమిలో జతకట్టిన పార్టీలు తెలంగాణకు ద్రోహం చేసినవేనన్నారు.
ఇక్కడ దాసరి.. అక్కడ కేసీఆర్ గెలవాలి..
పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో కేసీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేసుకోగలుగుతామని మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అన్నారు. తెలంగాణ ప్రాంతం విముక్తి కావడానికి తన తండ్రి వెంకటస్వామి కృషి చేశారని ప్రభుత్వ సలహాదారు వివేక్ అన్నారు. ప్రాణాహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం జరిగితేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. కూటమి వెనుక ఉన్న చంద్రబాబు కుట్రలను గమనించాలని సమావేశంలో భానుప్రసాద్‌రావు కోరారు. కూటమి తాళం చెవి చంద్రబాబు వద్ద ఉందన్నారు.
సమావేశానికి స్థానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ డాక్టర్ వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, నాయకులు కోట రాంరెడ్డి, డాక్టర్ టీవీరావు, నల్ల మనోహర్‌రెడ్డి, బాలజీరావు, పారుపెల్లి రాజేశ్వరి, సందవేన సునీత, గట్టు రమాదేవి, రఘువీర్‌సింగ్, అమ్రేష్, రాజు, రాజ్‌కుమార్, హన్మంత్, వివిధ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు కొమురయ్య యాదవ్, మార్క్ లక్ష్మణ్, రమారావు, వెంకట్‌రెడ్డి, రమేష్, పురుషోత్తం, శ్రీనివాస్‌గౌడ్, ఉప్పురాజు కుమార్, కొయడ సతీష్‌గౌడ్, తబ్రేజ్, సాబీర్‌ఖాన్, శ్రీనివాస్, చంద్రమౌళి, రాజేందర్‌యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment