సాక్షి, భువనగిరి: భువనగిరి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నరసయ్య ఓడిపోవడం చాలా బాధాకరమని ఆ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బూర ఓటమికి తానే కారణమంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బూర నరసయ్య ఓడిపోతారని తాను కలలో కూడా ఊహించలేదన్నారు.
ఈ అంశంపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోడ్డురోలర్ గుర్తువల్లే భువనగిరి లోక్‌సభ స్థానంలో తాము ఓడిపోయాం తప్ప వేరే కారణం లేదన్నారు. ‘బూర ఓటమికి నేనే కారణమంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని చూస్తే చాలా బాధేస్తోంది’ అని శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక హోటల్‌లో టాయిలెట్‌కు వచ్చిన సందర్భంలో ఎదురుపడ్డారని, అక్కడే ఉండటంతో తనను కాకతాళీయంగా కలిశారని అన్నారు. ఇది రహస్యంగా జరిగింది కాదని, అక్కడ అందరూ ఉన్నారని, ఇదంతా కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే జరిగిందని వివరించారు. తమ మధ్య ఎలాంటి ఇతర సంభాషణ జరగలేదని, ఇలా కలిసి అలా వెళ్లిపోయామని పేర్కొన్నారు. బొమ్మల రామరం మండలంలో ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్న మాటల్ని ఎంపీ పీఏ, ఎమ్మెల్యే మధ్య సంభాషణగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇంత ఘోరంగా దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. ఈ సంభాషణను వైరల్ చేసిన సైకోను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తానెంటో భువనగిరి ప్రజలకు తెలుసని, ఎంపీ బూర గెలుపుకోసం అందరమూ కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని అన్నారు. గత ఐదేళ్లలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనమీద ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భువనగిరిలో వందశాతం ఎగిరేది గులాబీ జెండాయేనని శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. విపక్షాలు రక్షసానందం పొందుతున్నాయన్నారు.
ఫోన్ సంభాషణలో మాట్లాడుకున్న వ్యక్తులైన బాలనర్సింహ యాదవ్, మల్లారెడ్డి కూడా ఈ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. జన సమీకరణ కోసమే మల్లారెడ్డితో తాను ఫోన్‌లో మాట్లాడానని, సన్నిహిత సంబంధాలు కారణంగా తాము సరదాగా మాట్లాడుకున్నామని బాలనర్సింహ యాదవ్ పేర్కొన్నారు. తాము మాట్లాడుకున్న దానిని సోషల్ మీడియాలో ఇలా వక్రీకరించి వైరల్ చేయడం బాధాకరమని, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన అంశంపై తాము మాట్లాడుకున్నామని, భువనగిరి నియోజకవర్గానికి ఈ సంభాషణ విషయంలో ఎలాంటి సంబంధం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment