ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జిల్లా నేతలకు దక్కని అవకాశం
ఆశావహులను బుజ్జగించిన కేసీఆర్
‘తక్కెళ్లపల్లి’కి పదవిపై హామీ
‘కుడా’ చైర్మన్‌గా యాదవరెడ్డి!
వరంగల్ : వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ వీడింది. ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశించిన జిల్లా నేతలకు అవకాశం దక్కలేదు. టీఆర్‌ఎస్ అడ్‌హక్ కమిటీ కన్వీనర్‌గా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాధారణ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నల్లగొండ జిల్లాలో ఉన్న అనురాగ్ విద్యా సంస్థల చైర్మన్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. రాజేశ్వర్‌రెడ్డి పూర్వీకులు వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం గుండ్లసాగరం. రాజేశ్వర్‌రెడ్డికి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చి మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవ్వడంపై టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌లో సుధీర్ఘకాలంగా పని చేస్తున్న జిల్లా నేతలు పలువురు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఆశించారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తమకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వస్తుందని అనుకున్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఇటీవలి వరకు ఉన్న రవీందర్‌రావు, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదవరెడ్డిలు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై నమ్మకంతో ఉన్నారు. టీఆర్‌ఎస్ అధిష్టానం రాజేశ్వర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయంతో ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశించిన జిల్లా నేతలు నిరాశకు గురయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశావహులను సముదాయించారు.
పదవిపై భరోసా
ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశించిన తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మర్రి యాదవరెడ్డిలకు పదవుల విషయంలో ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజేశ్వర్‌రెడ్డిని ప్రకటించే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు జిల్లాల టీఆర్‌ఎస్ నేతలతో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయభాస్కర్, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, టి.రవీందర్‌రావు, మర్రి యాదవరెడ్డి, కన్నెబోయిన రాజయ్య, ఎం.సహోదర్‌రెడ్డి, ఎన్.సుధాకర్‌రావు ఈ భేటీలో ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరావు, జిల్లా అధ్యక్షుడు డి.రాజేందర్, నల్లగొండ జిల్లా నుంచి మంత్రి జగదీష్‌రెడ్డి, బండ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన జిల్లాలోని పలువురు నేతలకు అవకాశాలు ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి చివరి వరకు పరిశీలనలో ఉన్న రవీందర్‌రావుతో కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయని అనునయించారు. అవకాశాలను బట్టి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవీ ఇస్తామని రవీందర్‌రావుకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశించిన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డికు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కుడాలో నియమించాల్సిన సభ్యులుగా ఎవరెవరు ఉండాలో పరిశీలించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అక్కడే ఉన్న కడియం శ్రీహరి, చందూలాల్, వినయభాస్కర్‌లకు సీఎం కేసీఆర్ సూచించారు. వారంలోపే ఈ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.
25న నామినేషన్
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేయనున్నారని పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు టి.రవీందర్‌రావు తెలిపారు. నల్లగొండలో జరగనున్న ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా హాజరుకావాలని సూచించారు. టీఆర్‌ఎస్ శ్రేణులు సమష్టిగా రాజేశ్వర్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు.
గులాబీల నారాజ్ !
Published Tue, Feb 24 2015 12:31 AM | Last Updated on Fri, Mar 22 2019 1:49 PM
Advertisement
Advertisement