బహిరంగ సభ వేదిక పైనుంచి ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి పోచారం
సాక్షి,ఎల్లరెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 105 సీట్లలో గెలుపొందుతుందని, సీఎం కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అవుతారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం పరిశీలించిన ఆయన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. 60 ఏళ్లలో కాంగ్రె‹స్, టీడీపీ పాలనలో జరగని అభివృద్ధిని కేసీఆర్ నాలుగేళ్లలో చేశారని, మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం ప్రవేశపెట్టారని ప్రశంసించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్య సమితి గుర్తించిందని, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని వ్యవసాయశాఖ కార్యదర్శికి సమాచారం వచ్చిందని పోచారం తెలిపారు.
తక్కువ సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందించేందుకు రంగం సిద్ధమవుతోందని చెప్పారు. తమ పాలనలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందన్నారు.కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల చొప్పున పంట రుణాలను మాఫీ చేస్తామని కల్లిబొల్లి మాటలను చెబుతున్నారని విమర్శించారు. కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు కాంగ్రెస్‌పై లేదని, కేవలం టీఆర్‌ఎస్‌పై మాత్రమే నమ్మకం ఉందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి రవీందర్‌రెడ్డి, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, గాంధారి జెడ్పీటీసీ తానాజీరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment