
ఇక ప్రజాప్రతినిధులకు శిక్షణపై దృష్టి
నాగార్జునసాగర్‌లో
టీఆర్‌ఎస్ శిక్షణ శిబిరం
మే 2, 3, 4 తేదీల్లో నిర్వహణ
హైదరాబాద్: సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, ప్లీనరీ, ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రజాప్రతినిధులపై దృష్టి పెట్టింది. అధికార పార్టీ సభ్యులుగా వారికి అన్ని రంగాలపై అవగాహన కల్పించాలని భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో వారిని సుశిక్షితులను చేసేందుకు పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున విజయం సాధించిన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొత్తవారి సంఖ్యే ఎక్కువ. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ వీరందరికీ శిక్షణ ఇవ్వాలని భావించారు. అయితే, ఆరేడు నెలలుగా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన శిక్షణ శిబిరాన్ని మే 2, 3, 4 తేదీల్లో, నాగార్జున సాగర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సాగర్‌లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రెండు రోజులు (మే 2, 3 తేదీల్లో) మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. దీనికోసం అస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా /ఎఎస్‌సీఐ)కి బాధ్యతలు అప్పజెప్పినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా పది అంశాలపై వీరికి శిక్షణ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.
అదేవిధంగా చట్టసభల్లో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి వంటి అంశాలపైనా అవగాహన కల్పించనున్నారని సమాచారం. పార్టీ ప్రజా ప్రతినిధులను ఉత్తమ పార్లమెంటేరియన్లుగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇస్తామని, ఆ దిశలోనే వీరికి అందించే శిక్షణ కార్యక్రమం ఉంటుందని పార్టీ నేత ఒకరు తెలిపారు.
మూడో రోజు మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), డీసీఎమ్మెస్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లను, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలను ఆహ్వానిస్తున్నారు. ఈ రోజు రాజకీయ శిక్షణ ఉంటుందని తెలిసింది. ఇప్పటికే సాగర్‌లో బస ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్లు లింగ్డో, టి.ఎన్.శేషన్‌లలో ఒకరిని ఆహ్వానించే అవకాశం ఉందని, అదేవిధంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త హన్మంతరావు ప్రసంగం కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, అధికారికంగా ఎలాంటి నిర్ణయం జరగలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మూడు రోజులపాటు సాగర్‌లోనే బస చేయనున్న సీఎం కేసీఆర్ శిక్షణను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి.