'మజ్లిస్ మెప్పు కోసం టీఆర్‌ఎస్ పాకులాట'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినంపై బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్ మెప్పు కోసం టీఆర్ఎస్ పాకులాడుతోందని, నాటి స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించడంలో టీఆర్ఎస్ వెనకడుగు వేస్తోందని విమర్శించారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ స్వయంగా కోరారని గుర్తుచేశారు.
విమోచన దినాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. నాటి ఉద్యమ కేంద్రాల్లో బీజేపీ జెండా కార్యక్రమాలతో పాటు అక్కడి విశిష్టతను ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. అమిత్ షా పర్యటనలోపు అన్ని పోలింగ్ బూత్‌ల్లో పార్టీ పటిష్టమయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు పాత పది జిల్లాల్లోని పోరాట కేంద్రాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాంమాదవ్, నితిన్ గడ్కరీ, హన్సరాజ్, మురళీధర్‌రావు సందర్శిస్తారని ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.