టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కార్మికవర్గం అసంతృప్తి
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు
సిరిసిల్ల :
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కార్మికవర్గం అసంతృప్తితో ఉందని సీఐటీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో సీఐటీ యూ జిల్లా మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై కార్మికలోకం ఎన్నో ఆశలు పెట్టుకుందని, మేనిఫెస్టో లో కూడా చాలా హామీలిచ్చారని పేర్కొన్నా రు. ఐదు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం కరెంటు కోతలు, కనీస వేతన చట్టం అమలు వంటి అంశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో గంటలు గంటలు చర్చలు జరిపిన సీఎం కేసీఆర్ కార్మిక సంఘాలతో ఇప్పటివరకు ఒక్క గంటైనా మాట్లాడలేదన్నారు.
ఎన్నో ఆశలతో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన కార్మికలోకం ఇప్పుడు నిరాశకు గురవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరలను పెంచగా, ప్ర స్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యజమానులకు అనుకూలమైన నిర్ణయాలు చేస్తోందన్నారు. కోరలు లేని కా ర్మిక చట్టాలను పటిష్టపరచాల్సి ఉండగా త్రై పాక్షిక కమిటీని ఏర్పాటు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. తె లంగాణలో కార్మికుడికి కనీస వేతనం రూ.15000 ఉండేలా చట్టం చేయాలన్నారు. సింగరేణిలో అటెండర్‌కు సైతం రూ.35 వేలు జీతం ఉందని, శ్రమను నమ్ముకున్న కార్మికుల కు మెరుగైన జీతం ఇవ్వాలన్నారు.
సిరిసిల్ల నేత కార్మికులు ఆత్మగౌరవంతో బతికేవిధంగా పవర్‌లూం షెడ్లు నిర్మించి సాంచాలను బ్యాంకు రుణాలతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణంలో ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ముత్యంరావు, మూషం రమేశ్, పంతం రవి, శ్రీరాం సదానందం, గంగారం, గణేశ్, అజయ్ పాల్గొన్నారు.