టీఆర్‌ఎస్ తీరుతో కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అధిష్టానం ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అధికార పార్టీ సంప్రదింపులు జరుపుతోందన్న వార్తలతో అధిష్టానం గురువారం మధ్యాహ్నం హుటాహుటిన పార్టీ సీనియర్లు గులాంనబీ ఆజాద్, వయలార్ రవిని ఎన్నికల పర్యవేక్షకులుగా హైదరాబాద్‌కు పంపించింది. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకుల లలితను గెలిపించే బాధ్యతను వీరికి అప్పగించింది. హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే వారిద్దరూ ఓ హోటల్‌లో పార్టీ ముఖ్యులు, పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్‌పీ నాయకుడు జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా కూడా ఆజాద్, వయలార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు, దాని ప్రలోభాలను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రెండో ప్రాధాన్యత ఓటు, పార్టీ విప్‌ను జారీ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్రాస్ ఓటింగ్‌ను అరికట్టడం తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. మిగిలిన ఎమ్మెల్యేలతోనూ శుక్రవారంవిడిగా సమావేశమవ్వాలని నిర్ణయించారు. పార్టీ అనుబంధ సభ్యునిగా ఉన్న దొంతి మాధవ రెడ్డికి వరంగల్ డీసీసీ అధ్యక్షునిగా అవకాశం కల్పించడంతో పాటు ఆయన అనుచరులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డికి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ చేజారుతుందా?
Published Fri, May 29 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement
Advertisement