సాక్షి, సిటీబ్యూరో : ఉచిత వైఫై, ఏటీఎం సెంటర్, సోలార్ రూఫింగ్, బయో డైజెస్టర్, ఇన్‌సినరేటర్లు, శానిటరీ నాప్‌కిన్ల విక్రయ కౌంటర్ వంటి సదుపాయాలతో ‘స్మార్ట్ వాష్‌రూమ్స్’ రానున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఇప్పటికే పలు స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ.. నగరంలోని 25 ప్రాంతాల్లో స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ వాష్‌రూమ్స్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్‌లో ఈ సంవత్సరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఇండోర్‌తో పాటు వివిధ నగరాల్లోని స్వచ్ఛ కార్యక్రమాల అమలును పరిశీలించి వచ్చిన అధికారులు ఈ స్మార్ట్ వాష్‌రూమ్స్ ఏర్పాటు చేయాలని భావించారు.
తొలిదశలో ఐటీ సంస్థలు, నిపుణులు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి జోన్ (పాత వెస్ట్‌జోన్)లో వీటిని ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతో ఆ దిశగా గ్రేటర్ అధికారులు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ)లో భాగంగా వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థల కోసం బిడ్లు ఆహ్వానించనున్నారు. ఉచిత సేవలందించే ఈ స్మార్ట్ వాష్‌రూమ్‌లు పురుషులకు, మహిళలకు, దివ్యాంగులకు వేర్వేరుగా ఉంటాయి.
వీటిని ఏర్పాటు చేసే సంస్థలు వాటిపై ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందడంతో పాటు, జీహెచ్‌ఎంసీకి కూడా కొంతమేర చెల్లించాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థల నుంచి ఓపెన్ బిడ్లు ఆహ్వానించేందుకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే వాటి నుంచి ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) స్వీకరించి ఏజెన్సీలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే శిల్పారామం ఎదుట ఇటీవల లగ్జరీ వాష్‌రూమ్స్ అందుబాటులోకి తేవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment