లైఫ్‌ సర్టిఫికెట్‌.. పెన్షనర్లకు వెసులుబాటు | TS Govt Easen Rules To Pensioners For Life Certificate | Sakshi
Sakshi News home page

లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంలో పెన్షనర్లకు వెసులుబాటు

Published Wed, Nov 6 2019 11:57 AM | Last Updated on Wed, Nov 6 2019 1:03 PM

TS Govt Easen Rules To Pensioners For Life Certificate - Sakshi

ప్రభుత్వ పెన్షన్‌ దారులు, ఫ్యామిలీ పెన్షనర్లు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏటా మాదిరిగానే పెన్షన్‌ కోసం వార్షిక ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఈ పత్రాన్ని ప్రతీ పెన్షనర్‌ తప్పనిసరిగా డిసెంబర్‌ 31లోగా అందజేయాలి. ఆ విధంగా అందజేసిన వారికి మాత్రమే తదుపరి ఆర్థిక సంవత్సరం పెన్షన్‌ అందజేస్తారు. అందజేయని వారికి 2020 మార్చి నెలకు సంబంధించి పెన్షన్‌ ఏప్రిల్‌లో ఇవ్వకుండా నిలిపివేస్తారు. అయితే, గతంలో మాదిరిగా తప్పనిసరి వ్యక్తిగతంగా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలనే నిబంధనలో కొంత సడలింపు ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో టీ ఫోలియో యాప్‌ ద్వారా కానీ, మీ సేవ కేంద్రాల నుంచి జీవన్‌ప్రమాణ్‌ సైట్‌ ద్వారా కానీ పంపించే వెసులుబాటు కల్పించారు. కాగా, మొబైల్‌ యాప్‌ ద్వారా ధ్రువీకరణ పత్రం అందజేసే అవకాశం కల్పించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఈ నిర్ణయంతో పెన్షనర్లు వ్యక్తిగతంగా కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండదు. ఉమ్మడి వరంగల్‌లో పరిశీలిస్తే ఒక్క వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోనే మొత్తం 19వేల మంది వరకు పెన్షనర్లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నూతన నిర్ణయంతో వీరందరూ కార్యాలయాలకు రావడంలో ఎదుర్కొనే ఆర్థిక, శారీరక భారం నుంచి బయటపడినట్లవుతుంది. ఈ మేరకు నూతన విధానంపై వివరణాత్మక కథనం.

మొబైల్‌ యాప్‌ ద్వారా..

  •      ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌లో టీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  •      సెల్‌ నంబర్, ఈ మెయిల్‌ ద్వారా రిజిష్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్‌ ఐడీగా సెల్‌ నంబర్‌ మారుతుంది. పిన్‌ను పాస్‌వర్డ్‌గా సెట్‌ చేసుకోవాలి. 
  •      సెల్‌ నంబర్, పాస్‌ వర్డ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా లాగిన్‌ అవ్వాలి. అనంతరం పెన్షనర్‌ మాన్యువల్‌ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ ద్వారా ఎంటర్‌ అవ్వాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుని బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ లేదా పెన్షనర్‌ ఐడీ నంబర్‌ నమోదు చేయాలి. ఓటరు ఐడీ కార్డు కార్డుపై ఉండే ఎపిక్‌ నంబర్, అసెంబ్లీ నియోజకవర్గం పేరు నమోదుచేయాలి.
  •      అనంతరం ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఆ సెల్ఫీఫొటో ఎపిక్‌ కార్డులోని ఫొటోతో వెరిఫై చేయబడి ఆమోదించినట్లు వెరిఫికేషన్‌ నంబర్‌ వస్తుంది. ఆ మెసేజ్‌ సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి చేరుతుంది.
  •      ట్రెజరీ కార్యాలయంలో అధికారి తనకు వచ్చిన వివరాలు, తన వద్ద అందుబాటులో ఉన్న వివరాలతో పోల్చి చూసుకుని ఆమోదిస్తారు. 
  •      దీని ద్వారా పెన్షనర్లు సుదూర ప్రాంతాల నుంచి ట్రెజరీ కార్యాలయానికి వచ్చే ఇబ్బంది ఉండదు. బ్యాంకులు, మీసేవ కేంద్రాలకు వెళ్లే అవసరం ఉండదు. ఇంటివద్దనే ఉండి ధ్రువీకరణ పత్రం అందజేయవచ్చు. ప్రస్తుతం మొబైల్‌ యాప్‌తో ధ్రువీకరణ పత్రం ఇచ్చే సదుపాయం కల్పించిన మొదటి రాష్ట్రం తెలంగాణ.

ట్రెజరీకి రాలేని వారి కోసం...
పెన్షనర్ల వయస్సు 75 సంవత్సరాలు పైబడి, కార్యాలయానికి రాలేని వారు ఇలా చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే తమ వార్షిక ధ్రువీకరణ పత్రాన్ని నివాస పరిధిలోని గ్రామపంచాయతీ ఈఓ ద్వారా ధృవీకరించి తమ ప్రతినిధుల ద్వారా ట్రెజరీలో అందజేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి స్వయంగా పెన్షనర్‌ గృహాన్ని సందర్శించి పెన్షనర్‌ కదలలేని పరిస్థితిలో ఉన్నట్లు ధృవీకరించి పత్రాన్ని జారీ చేస్తారు.

వీరు మాత్రమే...
ఆధార్‌ నంబర్‌ ఆధారంగా మీ సేవ కేంద్రంలో, ఓటర్‌ ఐడీ ద్వారా కూడా టీ యాప్‌ ఫోలియో యాప్‌ తో జీవన ధృవీకరణ పత్రాలు అందజేయలేని వారు మాత్రమే ట్రెజరీ కార్యాలయానికి రావల్సి ఉంటుంది. వారి పత్రాలు మాత్రమే ట్రెజరీ అధికారులు స్వీకరిస్తారు.

దివ్యాంగులకు..
ప్రభుత్వ ఉత్తర్వులు 315 ద్వారా పెన్షన్‌ పొందుతున్న దివ్యాంగులు తాము గత మూడేళ్లలోపు తీసుకున్న వైకల్య ధృవీకరణ పత్రాన్ని అందజేయాలి. మూడేళ్ల క్రితం తీసుకున్నట్లయితే అంగీకరించరు. 

మరికొన్ని సూచనలు

  •      లైఫ్‌ సర్టిఫికెట్‌లో అడిగిన అన్ని వివరాలు పెన్షనర్లు నింపాలి.
  •      పీపీఓ నంబర్, ఐడీ నంబర్, బ్యాంకుఖాతా నంబర్, ఆధార్, పాన్‌కార్డు వివరాలు అవసరం మేరకు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. 
  •      నెలసరి రూ.15వేలకు పైగా పింఛన్‌ పొందుతున్న వారు తప్పనిసరిగా పాన్‌కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 
  •      వివరాలు ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్‌లో మాత్రమే అందజేయాలి. 
  •      పెన్షనర్‌ కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందినట్లయితే ఆ వివరాలు అందజేస్తే పెన్షన్‌లో డీఏ కట్‌ చేస్తారు. డీఏను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో పొందొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉద్యోగి డ్రాయింగ్‌ అధికారి ద్వారా ధ్రువీకరించి అందజేయాల్సి ఉంటుంది. 
  •      రెండు చోట్ల డీఏ పొందినట్లయితే సదరు పెన్షనర్‌ / ఉద్యోగిపై చట్టరీత్యా చర్యలకు అవకాశం ఉంటుంది. 
  •      పెన్షనర్లు తమ 10వ పీఆర్‌సీ ఏరియర్స్‌ కోసం ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా అంజేయాలి.

కొన్ని నిబంధనలు

  •      పెన్షనర్‌ రెండో వివాహం చేసుకున్నట్లయితే ఆ వివరాలు ఏజీ ఆమోదం తర్వాత రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి.
  •      కారుణ్య నియామక ఉద్యోగం చేస్తున్న వారు స్వీయ ధ్రువీకరణ పత్రం, డ్రాయింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేయాలి.
  •      పెన్షన్‌ పొందుతున్న బ్యాంకులో కూడా వార్షిక  ధ్రువీకరణ పత్రం 
  •       అందజేయాలి.
  •      ట్రెజరీలో అందజేసిన పత్రాలకు రశీదు తప్పని సరిగా పొందాలి.
  •      పోస్టు ద్వారా పంపినవి, అసంపూర్తిగా నింపినవి అంగీకరించబడవు. 
  •      లైఫ్‌ సర్టిఫికెట్‌ అందజేయని వారి పెన్షన్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి నిలిపివేసే అధికారం ట్రెజరీ అధికారులకు ఉంది. 

సద్వినియోగం చేసుకోవాలి..
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అవకాశాన్ని పెన్షనర్లు  సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా కార్యాలయానికి వచ్చే భారం తప్పుతుంది. నూతన విధానం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ జీవిత ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే ఇబ్బందులు తొలగిపోతాయి. పెన్షనర్లు ఆన్‌లైన్‌ ద్వారా పంపిన వివరాలను అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా పెన్షనర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తారు.
– గుజ్జు రాజు, ఉప సంచాలకులు, ట్రెజరీ శాఖ, వరంగల్‌ అర్బన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement