
సీఎస్ పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయ వర్గాలు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖిక సమాచారం అందించాయి.
ఒకట్రెండు రోజుల్లో కేంద్ర సిబ్బంది వ్యవ హారాలు, శిక్షణ విభాగం(డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇటీవలే సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్‌చంద్ర ఈ నెలాఖరున రిటైర్ కావాల్సి ఉంది. కొత్త రాష్ట్రం కావటంతో పాటు ఐఏఎస్ అధికారుల కొరత, సీనియర్ అధికారుల సేవలు అవసరమని సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎస్ ప్రదీప్‌చంద్ర పదవీ కాలాన్ని 3 నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రదీప్‌చంద్ర సీఎస్‌గా కొనసాగనున్నారు.