డొక్కు బస్సులే | TS RTC Running Old Busses in Hyderabad | Sakshi
Sakshi News home page

డొక్కు బస్సులే

Published Sat, Sep 15 2018 9:07 AM | Last Updated on Fri, Sep 21 2018 10:18 AM

TS RTC Running Old Busses in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: కొండగట్టు రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సుల డొల్లతనాన్ని ఎత్తి చూపింది. ఈ దుర్ఘటన దాదాపు 60 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు అందరి చూపూ గ్రేటర్‌లో సేవలు అందిస్తున్న ఆర్టీసీ సిటీ బస్సులపై పడింది. నగరంలో తిరిగే బస్సుల జీవితం కాలం 12 లక్షల కిలోమీటర్లు లేదా 15 ఏళ్లు. మార్కోపోలో కంపెనీకి చెందిన సుమారు వెయ్యి బస్సుల జీవిత కాలం 5 నుంచి 6 లక్షల కి.మీ.కే పడిపోయింది. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ బస్సులు ప్రయాణికుల పాలిట శాపంగామారాయి. అద్దె ప్రాతిపదికపై నడిచే  బస్సులు తప్ప.. సుమారు 2500 ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో చాలా వరకు 15 ఏళ్లు దాటినవే ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. వీటికే పదేపదే మరమ్మతులు చేసి రోడ్డెక్కిస్తున్నారు. దీంతో ఇవి తరచూ బ్రేక్‌డౌన్‌ అయ్యి ఎక్కడో ఓ చోట ఆగిపోతున్నాయి. మరోవైపు పరిమితికి మించిన ప్రయాణికుల రద్దీ కూడా ఈ బస్సుల నిర్వహణకు, ప్రయాణికుల భద్రతకు సవాలుగా మారుతోంది. చాలా ఏళ్ల నాటి పాత నమూనాలో రూపొందించిన సిటీ బస్సులు ప్రయాణికుల భద్రతా ప్రమాణాల దృష్ట్యా కూడా  ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయం ఉంది.

స్థానిక విడిభాగాలతో పెనుముప్పు
ఈ బస్సుల మరమ్మతుల కోసం వినియోగించే నాణ్యత లేని విడిభాగాలు కూడా ప్రయాణికుల భద్రతకు పరీక్ష పెడుతున్నాయి.విడిభాగాల్లో అతి ముఖ్యమైన గేర్‌ బాక్సులు మొదలుకొని నట్లు, బోల్టులు, ప్లేట్‌లు, సిమ్స్, బ్రుష్‌లు వంటివి రాణిగంజ్, అఫ్జల్‌గంజ్‌లోని స్థానిక కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రామాణిక కంపెనీల నుంచి విడిభాగాలు సకాలంలో అందడం లేదనే కారణంతో ఇలా నాణ్యత లేని వాటిని వినియోగిస్తున్నారు. దీనివల్ల బ్రేక్‌డౌన్‌లు సమస్యలు పెరుగుతున్నాయి. నగరంలో తరచుగా బ్రేకులు ఫెయిల్‌ కావడం వల్ల జరిగే  ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఇలాంటి నాణ్యతలేని విడిభాగాలే కారణమని ఆర్టీసీ మెకానిక్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విడిభాగాలు వినియోగించడం ద్వారా బస్సు జీవితం కాలం పెరగడం అటుంచి మరింత క్షీణిస్తోంది. దీనికి ప్రయాణికుల రద్దీ ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. ప్రయాణికులు ఎక్కువగా ఉండడం వల్ల డ్రైవర్లు సకాలంలో బస్సును అదుపు చేయలేకపోతున్నారు. దీంతో ఆర్టీసీ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది.

మార్పు కోరుకోని ఆర్టీసీ..
ప్రయాణికుల అభిరుచికి, ఆధునిక రవాణా సదుపాయాలకు అనుగుణంగా సిటీ బస్సుల్లో మార్పులు రావడం లేదు. క్యాబ్‌లు, ట్యాక్సీలు వంటి వాహనాలతో ఆర్టీసీ పోటీ పడలేకపోతోంది. ఏళ్లకు ఏళ్లుగా కాలం చెల్లిన డొక్కు బస్సులనే నడపడం వల్ల సంస్థ ప్రయాణికుల నుంచి తీవ్రమైన నిరాదరణకు గురవుతోంది. ఆధునిక రవాణా వాహనాల్లోని భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన మినీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు రావాలనే ప్రతిపాదన పెండింగ్‌ జాబితాలో చేరిపోయింది. ఇరుకైన రహదారులు, విస్తరిస్తున్న నగరం అవసరాలకు అనుగుణంగా క్యాబ్‌లు, ట్యాక్సీల తరహాలో రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు మినీ బస్సులే ఎంతో సౌకర్యంగా ఉంటాయని నిపుణులు సైతం చెబుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్లేందుకు అవకాశం లభిస్తుందని, పైగా ప్రయాణికుల సంఖ్య పరిమితంగా ఉండడం వల్ల ఎలాంటి ఒత్తిడి ఉండదంటున్నారు. అలాగే రద్దీ లేకుండా ఒక చోట నుంచి మరో చోటకు సులువుగా చేరుకోవచ్చు. ఇదిలా ఉంటే నగరంలో మెట్రో రైళ్ల రాకతో మినీ బస్సులను సైతం సమాతరంగా ప్రవేశపెట్టాలని భావించారు. కానీ ఈ అంశంపై ఇప్పటి దాక ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరోవైపు అనేక నగరాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రజా రవాణా వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ గ్రేటర్‌ ఆర్టీసీ ఈ ఆధునికతను అందుకోవడంలోనూ వెనుకబడే ఉంది. దీంతో ఒకవైపు రోడ్లపై వాహనాల రద్దీ, మరోవైపు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ వెరసి ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది.

రోడ్డెక్కని 100 మినీ బస్సులు
పర్యాటకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల అభిరుచికి అనుగుణంగా సిటీలో మినీ బస్సులను నడపాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా, వేగంగా సురక్షతంగా వెళ్లేందుకు చిన్న బస్సులు అవసరమని చాలా ఏళ్ల క్రితమే  గుర్తించారు. అప్పట్లో పాతబస్తీలో కొన్నింటిని ప్రవేశపెట్టారు. చార్మినార్‌ కేంద్రంగా ఈ బస్సులు వివిధ ప్రాంతాలకు తిరిగేవి. కానీ వీటిలో చాలా వరకు లక్షల కిలోమీటర్లు నడవడం వల్ల కాలం చెల్లిపోయాయి. ఇటీవల ఉప్పల్‌– అమీర్‌పేట్‌– మియాపూర్‌ మధ్య మెట్రో రైలును ప్రారంభించడంతో పాటే 100 మినీ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ ప్రతిపాదన కార్యాచరణకు నోచుకోలేదు. మెట్రో రైలు మార్గాలకు రెండు వైపులా ఉండే కాలనీలు, ప్రధాన ప్రాంతాల నుంచి ప్రయాణికులను మెట్రో స్టేషన్లకు చేరవేసేందుకు మినీ బస్సులను నడుపనున్నట్లు అప్పట్లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అసెంబ్లీలోనే  ప్రకటించారు. ఓలా, ఉబర్‌ క్యాబ్‌లు, ఆటోరిక్షాల నుంచి వచ్చే పోటీని దృష్టిలో ఉంచుకొని తక్కువ మంది ప్రయాణికులతో ఎక్కువసార్లు రాకపోకలు సాగించేలా మినీ బస్సులను అందుబాటులోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రేటర్‌లో సురక్షితమైన, వేగవంతమైన ప్ర యాణ సదుపాయం ఓ కలగా మిగిలిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement