సిలబస్ మార్పులపై కమిటీ | tspsc set up committee on syllabus change | Sakshi
Sakshi News home page

సిలబస్ మార్పులపై కమిటీ

Published Sat, Jan 3 2015 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

సిలబస్ మార్పులపై కమిటీ

సిలబస్ మార్పులపై కమిటీ

* పోటీ పరీక్షల విషయంలో టీఎస్‌పీఎస్‌సీ కసరత్తు

సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) దృష్టిసారించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. పరీక్షల సిలబస్‌లో చేయాల్సిన మార్పులను సూచిస్తూ ఈ కమిటీ వారంలోగా నివేదిక ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. అందులోని సిఫారసులను పరిశీలించిన తర్వాత సిలబస్ మార్పులపై తుది నిర్ణయం తీసుకుని ఫైలును ప్రభుత్వామోదం కోసం పంపించాలని కమిషన్ భావిస్తోంది.

ప్రస్తుత సిలబస్‌లో గ్రూప్-1లో 25 శాతం వరకు, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల్లో 50 శాతం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే ఉన్నట్లు సమాచారం. ఈ సిలబస్‌ను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయాలని కమిషన్ భావిస్తోంది. ఏపీకి సంబంధించిన చాలావరకు సమాచారం అవసరం లేదని, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చరిత్రకు సంబంధించిన అంశాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివరాలనే సిలబస్‌లో పెట్టాలని భావిస్తోంది. తద్వారా ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నష్టం ఉండదని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా నోటిఫికేషన్ల తర్వాత విద్యార్థులకు కొంత సమయం ఉంటుంది కనుక వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నాయి.

ఇక వచ్చే నెల మొదటి వారంలో టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు సంబంధిత ఐటీ విభాగం అధికారులతో కమిషన్ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో(ఏపీపీఎస్సీ) పని చేస్తున్న తెలంగాణ సిబ్బందిని తెలంగాణకు కేటాయించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి.

నోటిఫికేషన్ల జారీలో తప్పని జాప్యం!
రాష్ట్ర విభజనలో భాగంగా వివిధ శాఖల్లో సిబ్బంది విభజనే పూర్తి కానందున కొత్త నోటిఫికేషన్ల జారీపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వ శాఖలు తమ అవసరాల మేరకు ఉద్యోగ నియామకాల కోసం ఇండెంట్లు(ప్రతిపాదనలు) ఇస్తే తప్ప నోటిఫికేషన్లు జారీ చేయడం టీఎస్‌పీఎస్‌సీకి సాధ్యం కాదు. శాఖలవారీగా ఖాళీ పోస్టులు, కేడర్లవారీగా అర్హతల వివరాలను ఆయా శాఖలే కమిషన్‌కు అందజేయాలి. అలాగే ఆయా పోస్టుల భర్తీకి సర్‌ప్లస్ మ్యాన్‌పవర్ సెల్(ఎస్‌ఎంపీసీ), ఆర్థిక శాఖలు అనుమతివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏ శాఖలోనూ ఉద్యోగుల విభ జన పూర్తి కాలేదు. అది పూర్తయితేనే శాఖలవారీ అవసరాలపై స్పష్టమైన సమాచారం వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఇప్పటికిప్పుడు ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు టీఎస్‌పీఎస్‌సీలోనూ చైర్మన్, ముగ్గురు సభ్యులు, కార్యదర్శి మినహా మరే సిబ్బంది లేరు. కమిషన్‌లో పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ పోస్టుల్లోకి ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న సిబ్బంది రావాల్సి ఉంది. ఉద్యోగుల విభజన పూర్తయితేనే ఈ పరిస్థితి చక్కబడుతుంది. అప్పటివరకు ఇతర అంశాలపై కమిషన్ దృష్టి సారించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు మరింతకాలం వేచి చూడక తప్పదు.

కమిషన్‌కు పోస్టుల మంజూరు
టీఎస్‌పీఎస్‌సీకి 121 పోస్టులను సృష్టిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అదనపు కార్యదర్శి స్థాయి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు పోస్టులను మంజూరు చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీపీఎస్సీ నుంచి కమిషన్‌కు వచ్చే ఉద్యోగులు మినహా మిగతా పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిషన్‌కు అదనపు కార్యదర్శి-1, డిప్యూటీ కార్యదర్శి-2, అసిస్టెంట్ సెక్రటరీ-6, అసిస్టెంట్ సెక్రటరీ(అకౌంట్స్)-1, సెక్షన్ ఆఫీసర్-26, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-26, జూనియర్ అసిస్టెంట్-26, ష్రాఫ్-1, రికార్డు అసిస్టెంట్-5, రెనో ఆపరేటర్-2, జామేదార్-1, దఫేదార్-2, డ్రైవర్-2, ఆఫీస్ సబార్డినేట్-20 పోస్టులు కొత్తగా వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement