సాక్షి, పరిగి: ఆర్టీసీ డ్రైవర్ మృతితో వికారాబాద్ జిల్లా లోని పరిగి పట్టణం అట్టుడికింది. పరిగి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తోన్న వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని మందిపల్ గ్రామానికి చెందిన సంగంశెట్టి వీరభద్రప్ప శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వీరభద్రప్ప తన భార్య నందిని, పిల్లలు వైష్ణవి(6), బుజ్జి(3) తో కలసి పరిగిలో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మూడు నెలలుగా వేతనాలు అందకపోవడం, ఇతడికి మరే ఆధారం లేకపోవడంతో ఆర్థికంగా చితికిపోయాడు. ఈక్రమంలో రెండ్రోజుల క్రితం అస్వస్థతకు లోనయ్యాడు.
శుక్రవారం ఉదయం గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు అతన్ని వికారాబాద్‌లోని మహవీర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు వీరభద్రప్ప మృతదేహంతో పరిగి డిపో వద్ద ధర్నా నిర్వహించారు. హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నిరసనకారులు బారికేడ్ల ను తొలగించే ప్రయత్నం చేయడంతో పోలీసులతో వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు డీఆర్వో వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తా మని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment