
పూలు ఇస్తున్న ఆర్టీసీ కార్మికులు
సాక్షి, మంచిర్యాల : ‘ఆర్టీసీలో ఖాళీలు భర్తీచేస్తే మీకూ పర్మినెంట్ ఉద్యోగాలు వస్తాయి.. ఈరోజు మేం చేసేది కూడా ఉద్యోగభద్రత, సంస్థ పరిరక్షణ కోసంమే.. మా పొట్టకొట్టకండి..’ అంటూ ఆర్టసీ కార్మికులు తాత్కాలిక డ్రైవర్లను వేడుకున్నారు. చేతికి పూలు ఇచ్చి.. దండం పెడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జేఏసీ శిబిరం నుంచి బస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు కార్మికులు యత్నించగా.. పోలీసులు అప్రమత్తమై నిలువరించారు. శాంతియుతంగా వెళ్లి తాత్కాలిక కార్మికులను కలిసి తమ గోడును చెప్పుకుంటామని కార్మికులు పోలీసులను ప్రాథేయపడ్డారు. చివరకు అక్కడే ఉన్న తాత్కాలిక కార్మికులు పోలీసుల వలయంలో భారికేడ్ల వద్దకు రాగా అవతలివైపు నుంచి కార్మికులు పూలు ఇచ్చి తమ బాధలను వెళ్లబోసుకున్నారు. మరోవైపు వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి.
దీంతో మరికొందరు కార్మికులు రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులను ఆపి.. పూలు ఇచ్చి దండం పెడుతూ విధులకు హాజరుకావొద్దని బతిమాలాడారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అటుగా రావటం.. కార్మికులను అదుపులోకి తీసుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కార్మికులందరినీ చెదరగొట్టారు. బస్టాండ్ సమీపంలోని రహదారిపై, జేఏసీ శిబిరం వద్ద ఉన్న కార్మికులను అదుపులోకి తీసుకుని బలవంతంగా వాహనంలో ఎక్కించి పలు పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఉద్యోగి సోమ్మసిల్లి పడిపోవటంతో ఆసుపత్రికి తరలించారు.
కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment