హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రాజెక్టులంటూ పబ్బం గడుపుతోందని టీటీడీపీ నేతలు ఆరోపించారు. ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బాబ్లీ ప్రాజెక్టు ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులపై టీఆర్ఎస్ శ్వేత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 75 శాతం పూర్తి అయని ప్రాజెక్టులకు ముందుగా నిధులు కేటాయిస్తే.. ఏడాదిలో పూర్తయి లక్ష ఎకరాలకు నీరందే అవకాశం ఉందని వారు సూచించారు. వాటన్నింటిని గాలికి వదిలేసి కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని ఆరోపించారు.
టీడీపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని.. ఆ నెపంతోనే టీఆర్ఎస్ కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా తెచ్చి ఐదేళ్లలో పూర్తి చేస్తామని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని గాలికొదిలేశారని మండిపడ్డారు. వాటర్ గ్రిడ్, ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్సీ ప్రాజెక్టు ఎడారి అయ్యేందుకు సీఎం కేసీఆరే కారణమని వారు ఆరోపించారు. ప్రాజెక్టుల పని ఆగితే వాటిని టీడీపీ అడ్డుకుంటోందని మాట్లాడటం సమంజసం కాదన్నారు.
'కొత్త ప్రాజెక్టులంటూ టీఆర్ఎస్ పబ్బం'
Published Mon, Jun 15 2015 1:12 PM | Last Updated on Mon, Aug 27 2018 8:19 PM
Advertisement