కొందుర్గు, న్యూస్‌లైన్ : ఆడుతూ, పాడుతూ కళ్లముందే తిరిగిన ఇద్దరు చిన్నారులు కొద్ది క్షణాల్లోనే నీట కుంటలో పడి దుర్మరణం పాలు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే... కొందుర్గు మండలం జాకారం గ్రామపంచాయతీ పరిధిలోని లోక్యానాయక్‌తండాకు చెందిన ఆంగోతు పాండునాయక్, లాలి దంపతులకు కుమారులు గుండ్యా (5) 12 ఏళ్ల రాగ్యా, పదేళ్ల కూతురు అనిత ఉన్నారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాగే అదేతండాకు చెందిన రాములునాయక్, సోనిబాయి దంపతులకు కూతురు సవిత (7) కుమారులు ఎనిమిదేళ్ల సేవ్యా, ఏడాది చింటు ఉన్నారు. మూడేళ్లక్రితమే తండ్రి దుబాయ్‌కి వలస వెళ్లాడు.
తల్లి స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్థానికంగా పాఠశాల లేకపోవడం వల్ల ఈ తండాకు చెందిన విద్యార్థులు జాకారం ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. ఇక్కడే గుండ్యా ఒకటో, సవిత రెండో తరగతి చదువుకుంటున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం తోటి పిల్లలతోపాటు పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు. సాయంత్రం వీరిద్దరితో పాటు తోటి స్నేహితులు బాలు, చరణ్‌తో కలిసి ఆటలాడుకునేందుకు బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తండాకు సమీపంలోని ఎర్రకుంటలో పడి నీట మునిగారు.
ఇది గమనించిన స్నేహితులు వెంటనే తండావాసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోపు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘనటతో తండాలో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబాలను ఎల్‌హెచ్‌పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు మంగులాల్‌నాయక్ తదితరులు పరామర్శించారు. ప్రభుత్వం గిరిజన కుటంబాలకు ఉపాధి కల్పించకపోవడం వల్లే వలసలు పెరుగుతున్నాయని ఆరోపించారు. వారిని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆడుకునేందుకు వెళ్లి..
Published Sun, Mar 23 2014 4:35 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM
Advertisement
Advertisement