ఇద్దరు ‘చంద్రుల’ దిష్టిబొమ్మలు దహనం
హైదరాబాద్: ఇద్దరు ‘చంద్రుల’దిష్టిబొమ్మల దహనం ఒకేసారి జరగడంతో బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు టీఆర్‌ఎస్, ఇటు టీడీపీ కార్యకర్తలు ఏకకాలంలో పోటా పోటీగా ఈ కార్యక్రమం నిర్వహించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ తెలుగు మహిళలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి గంట తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు పి. విజయారెడ్డి కొద్దిసేపటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకుని అప్పుడే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న తెలుగు మహిళా నాయకురాలు శోభా హైమావతి తన అనుచరగణంతో కలసి నేరుగా ట్రస్ట్ భవన్ వద్దకు వచ్చారు. అదే సమయంలో టీఆర్‌ఎస్ మహిళలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. ఓ వైపు టీడీపీ, ఇంకోవైపు టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఖబడ్దార్ అంటూ టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై చెప్పులు విసిరారు. కొంతమంది టీఆర్‌ఎస్ కార్యకర్తలకు చెప్పులు తగిలాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా పరిస్థితి కొద్దిసేపటి దాకా అదుపులోకి రాలేదు. అదే సమయంలో తెలుగు మహిళ లు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
ఇంకోవైపు టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా పోలీసు వలయాన్ని ఛేదించుకొని ట్రస్ట్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా గంట పాటు ఇక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. చివరకు పోలీసులు అప్రమత్తమై టీఆర్‌ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది.