మద్యం సేవించిన ఇద్దరు కానిస్టేబుల్లు విధుల్లో ఉన్న మరో కానిస్టేబుల్ పై దాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు... టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నర్సింగ్, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సతీష్ ఇద్దరు కలిసి ఆదివారం రాత్రి మద్యం సేవించారు.
ఈ క్రమంలో తన స్నేహితుడిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని సతీష్ నర్సింగ్ తో చెప్పడంతో ఇద్దరూ కలిసి స్టేషన్ కు బయలు దేరారు. స్టేషన్ ముందు సెంట్రిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి మీరు ఎవరు? అని ప్రశ్నించగా.. మమ్మల్నే ఎవరంటావా.... అంటూ అతనిపై దాడి చేశారు. వివాదం ముదరడంతో.. తోటి పోలీసులు కల్పించుకుని వారిని అక్కడి నుంచి పంపించారు. అయితే దాడి చేసిన పోలీసులపై ఇంత వరకూ కేసు నమోదు కాలేదు.