మెట్‌పల్లి(కోరుట్ల): ఆ ఇద్దరు నేతలు..పాత కరీంనగర్ జిల్లా నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఒకరు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. మరొకరు గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో చెరగని ముద్రను వేసి ‘కరీంనగర్ కీర్తిని’ జాతీయస్థాయిలో చాటారు. వారిలో ఒకరు పీవీ నర్సింహారావు కాగా, మరొకరు చెన్నమనేని విద్యాసాగర్‌రావు.
మంథని నుంచి పీవీ అడుగులు..
పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నర్సింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962,67,72లో వరుసగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ,సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా వ్యవహరించారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఈ పదవీలో కొనసాగిన ఆయన ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హన్మకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు.
1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 1984, 89 సంవత్సరాల్లో మహరాష్ట్రలోని రాంటెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన ఆయన తన హయాంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి దివాలా తీసే పరిస్థితిలో ఉన్న దేశ ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం పోశారు. మారుమూల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పీవీ అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయారు.
మెట్‌పల్లిలో వికసించిన ‘సాగర్‌జీ’
ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారాం చెన్నమనేని విద్యాసాగర్‌రావు స్వగ్రామం. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై అసక్తి కనబర్చిన సాగర్‌జీ ఏబీవీపీలో చురుకుగా వ్యవహరించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985లో మెట్‌పల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1989, 1994లోనూ గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1998లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఏడాదికి జరిగిన ఎన్నికల్లోనూ మరోమారు గెలుపొందారు. ఆ సమయంలో వాజ్‌పేయ్ ప్రభుత్వంలో హోం, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు.
సుమారు రెండు దశాబ్దాల పాటు ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన సాగర్‌జీ 2004నుంచి రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆ సంవత్సరం లోక్‌సభకు జరిగిన ఎన్నిల్లో పరాజయం పాలయ్యారు. 2009లోను మరోసారి పరాభావం ఎదురైంది. దీంతో ఆయన తిరిగి అసెంబ్లీ ఎన్నికల వైపు దృష్టిసారించి 2009లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయినా ఆ ఎన్నికల్లోను విజయం దక్కలేదు. 2014లో కరీంనగర్ లోకసభ నుంచి పోటీ చేయగా, అప్పుడూ చేదు అనుభవమే ఎదురైంది. వరుస పరాజయాలతో ఇక సాగర్‌జీ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్లేననే ప్రచారం జరిగింది. కాని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఊహించని విధంగా ఆయనను మహరాష్ట్ర గవర్నర్‌గా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment