హైదరాబాద్‌లో మరో 2 విమానాశ్రయాలు: కేసీఆర్
హైదరాబాద్‌లో మరో 2 విమానాశ్రయాలు: కేసీఆర్
Published Tue, Jul 8 2014 1:37 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న దానికంటే హైదరాబాద్ మూడింతలు పెరుగుతుందని, దీనిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఆర్థిక వెన్నెముక అని, ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం కేంద్రమే రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల రాకపోకల కోసం శామీర్‌పేట, ఘట్‌కేసర్‌వైపు మరో రెండు విమానాశ్రయాలు ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా మెట్రో రైలును పొడిగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు.
ప్రస్తుత ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్)కు 60-70 కిలోమీటర్ల దూరంలో మరో ఓఆర్‌ఆర్ నిర్మిస్తామని.. వాటి బయటే పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను హైటెక్ నగరంగా మార్చామని కొందరు గొప్పలు చెప్పారని.. కానీ వర్షాలు పడితే ముఖ్యమంత్రి, గవర్నర్ నివాసాల ముందు మోకాళ్ల లోతునీరు నిల్వ ఉంటుందని విమర్శించారు. ట్యాంక్‌బండ్ కింద ఉన్న స్థలం మొత్తాన్ని ధారాదత్తం చేశారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాల్సి ఉందని వివరించారు. హైదరాబాద్ నగరంలో 58 వేల అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించిందని కేసీఆర్ చెప్పారు. అక్రమ కట్టడాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించామన్నారు. తెలంగాణలో 38 శాతం పట్టణీకరణ ఉందని, ఇది రాబోయే కాలంలో 50 శాతానికి పెరుగుతుందని పేర్కొన్నారు.
Advertisement