చిన్నకోడూరు/రామచంద్రాపురం : జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రోడ్డును దాటుతున్న వృద్ధురాలిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ సంఘటన చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ వద్ద రాజీవ్హ్రదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బైరోజు శాంతమ్మ (55)కు భర్త అనారోగ్యంతో మృతి చెందగా.. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యంతో మంచం పట్టాడు. ఇదిలా ఉండగా.. శాంతమ్మ గ్రామంలోని బస్‌స్టాప్ వద్ద రోడ్డుపై పండ్లు విక్రయిస్తూ వచ్చే ఆదాయంతో కుమారుడిని పోషిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం శాంతమ్మ గ్రామంలో రోడ్డు దాటుతుండగా సిద్దిపేట వైపునుంచి వస్తున్న కారు ఢీకొంది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న చిన్నకోడూరు ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్ అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మంచంపై ఉన్న కుమారుడి పరిస్థితిపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. స్కూటర్, మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన రామచంద్రాపురం జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవీందర్‌రెడ్డి కథనం మేరకు.. పట్టణంలో శ్రీనివాస్ నగర్‌లో నివాసముండే అశోక్ (45) పటాన్‌చెరు మార్క్‌ఫెడ్ శాఖలో కూలీగా పనిచేస్తున్నాడు.
కాగా.. గురువారం మధ్యాహ్నం పటాన్‌చెరు నుంచి రామచంద్రాపురం వైపు స్కూటర్‌పై బయలుదేరాడు. అయితే అశోక్ ప్రయాణిస్తున్న రోడ్డులోనే వెనుక ఓ బైక్‌పై వేగంగా వస్తున్నాడు. కాగా స్కూటర్‌ను అధిగమించే క్రమంలో బైక్.. అశోక్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో ఇరువురూ డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే ఉస్మానియా ఆస్పత్రిలో అశోక్ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి హైదరాబాద్ కూకట్‌పల్లి లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న వ్యక్తి పూర్తి వివరాలు తెలియరాలేదు. మృతుడు అశోక్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
Published Fri, Jun 27 2014 11:51 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement