
రెండెకరాలు.. రెండు హత్యలు
► వీడిన జంట హత్యల కేసు మిస్టరీ
►బంధువులే నిందితులు
►ఏడుగురి అరెస్ట్, రిమాండ్
కనగల్: రెండెకరాల భూమి రెండు కుటుంబాల్లో చిచ్చురేపింది.. నివురుగప్పిన నిప్పులా మారిన పాతకక్షలు భగ్గుమని చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి.. కనగల్ మండలంలో ఇటీవల చోటు చేసుకున్న జంట హత్యల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంధువులే ఘాతుకానికి ఒడగట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. దారుణానికి పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు కనగల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చండూర్ సీఐ రమేశ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు.
బతుకుదెరువు కోసం..
చండూరు మండలం నెర్మట నుంచి దశాబ్దం క్రితం యాదయ్య తన భార్య ముగ్గురు కొడుకులతో కలిసి కురంపల్లికి వచ్చాడు. యాదయ్య భార్య యాదమ్మ అమ్మమ్మ ఊరు కావడంతో మేనమామలు పాండరయ్యతో పాటు మరో ముగ్గురు మామల దాపులో ఉంటున్నారు. ఈ క్రమంలో పాండయ్య పెద్ద కొడుకు అక్కలయ్య కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో పాండరయ్య 2.5 ఎకరాల భూమిని కోడలు పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఒకవేళ విడాకులు తీసుకుని వెళ్లిపోతే భూమి పాండరయ్య కుటుంబానికి చెందే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కోడలు విడాకులు తీసుకుని వెళ్లిపోగా ఆమె పేరున ఉన్న భూమిని యాదయ్య కొనుగోలు చేయడంతో ఐదేళ్లుగా రెండు కుటుంబాల్లో వివాదం సాగుతోంది.
కొడుకును కొట్టారని..
తమ భూమిని ఏ విధంగా కొనుగోలు చేశారని పాండరయ్య పెద్ద కుమారుడు అక్కలయ్య ఇటీవల యాదయ్య అతడిని కుమారులు దాసరి ఆంజనేయులు, అన్నమయ్యను నిలదీశాడు. దీంతో వారు అక్కలయ్యను చావబాదారు. విషయం తెలుసుకున్న పాండరి తమ భూమిని అక్రమంగా కొనుగోలు చేయడమే కాకుండా కుమారుడిని కొట్టారని కక్ష పెంచుకున్నాడు.
అదును చూసి..
యాదయ్య కుమారులు ఒంటరిగా ఎక్కడ దొరుకుతారని పాండరి అదును కోసం చూడసాగాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న వ్యవసాయ భూమి వద్దకు వచ్చిన దాసరి ఆంజనేయులు, అన్నమయ్యను అప్పటికే అక్కడ మాటు వేసిన దోటి పాండరయ్యతోపాటు ఆయన కొడుకులు అక్కలయ్య, మల్లేశ్, పాండరయ్య తమ్ముడైన వెంకటేశం ఆయన ముగ్గురు కొడుకులు సైదులు, భరత్, కిరణ్‌లు మారణాయుధాలతో దారుణంగా నరికి చంపారు. భూ వివాదంతోనే హత్యలు చోటుచేసుకున్నాయన్న కోణంలో పోలీసులు విచారణ జరి పారు. అప్పటికే పరారీలో ఉన్న పాండరిపై అతడి కుటుంబ సభ్యులను అనుమానించారు.
శనివారం రేగట్టెలు ఉన్నారన్న సమచారం మేరకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని సీఐ వివరించారు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై డి. నర్సింహులు, రాజు, మధు, వెంకటయ్య, భాస్కర్‌రెడ్డి ఉన్నారు.