
సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన ప్రగతితో అగ్రగామిగా దూసుకుపోతోన్న తెలంగాణ నిజంగా దేవభూమి అని, రాష్ట్రం దేవరాష్ట్రమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడ జరిగినన్ని పూజలు దేశంలో మరెక్కడా జరగవని, ఆలయాలు, మసీదులు, చర్చీలను సమానంగా చూస్తున్న ఘనత ఒక్క తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తనను తాను అభివృద్ధి చేసుకుంటూ దేశనిర్మాణంలోనూ తెలంగాణ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నదని చెప్పారు. ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలో పంచాంగ శ్రవణం అనంతరం సీఎం మాట్లాడారు.
పంచాంగం గొప్ప సైన్స్: పూర్వకాలంలోనే గ్రహణాలకు సంబంధించి ఖచ్చితమైన సమయాన్ని లెక్కకట్టేవారని, పురాణాలు, ఇతిహాసాల ద్వారా అద్భుతమైన విజ్ఞానం మనకు సంక్రమించాయని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ‘‘పంచాంగమంటే ఆషామాషీ వ్యవహారం కాదు గొప్ప సైన్స్. పంచాగ రచన అనేది శాస్త్రీయ రచనే. ఇందులో మూల సిద్ధాంతం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. చెప్పేవారు ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవచిస్తారు. ఈ ఏడాది తెలంగాణకు అన్ని రకాలుగా బాగుంటుందని పండితులు చెప్పారు. రాష్ట్రంలోని దుర్మార్గుల ప్రకోపం కూడా తగ్గుతుందని అంటున్నారు. తనను తాను అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్న తెలంగాణ.. దేశ నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నది. ఇక రాజకీయాలకొస్తే.. కొన్ని రాశులవారికి ఎమ్మెల్యే టికెట్లు కష్టమని పండితులు అంటున్నారు. ఆయా రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్‌లో కూర్చోకుండా ప్రజల మధ్యకు వెళ్లి పనిచేయాలి..’ అని సీఎం చెప్పారు.
మంత్రులకు ఉద్వాసన?
ప్రగతి భవన్ ఉగాది వేడుకల్లో పంచాగ శ్రవణం చేసిన బాచంపల్లి సంతోశ్‌కుమార్ శర్మ.. పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. అతి త్వరలోనే 5 నుంచి 8 మంది మంత్రులకు ఇబ్బందులు తప్పవని, మళ్లీ వారికి పదవులు లభించడం కష్టమేనని చెప్పడం, కొన్ని రాశులవారికి ఎమ్మెల్యే టికెట్లు దక్కవని హెచ్చరించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దేవాదాయ శాఖలో అవినీతికి ఆస్కారం ఉందని, పశువులకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి పశుసంవర్థకశాఖ అప్రమత్తంగా ఉండాలని, అక్టోబర్‌లో వానలు.. డిసెంబర్‌లో వరదలు వస్తాయని సంతోశ్ శర్మ చెప్పారు. సూర్య గ్రహ బలంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. ఎక్కడైనా చక్రం తిప్పగలరని పేర్కొన్నారు. మీడియా వార్తల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.. శుక్రప్రభావంతో 365 రోజులూ వార్తలే వార్తలుంటాయని చమత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment