అన్ని సర్టిఫికెట్లలో అమ్మ పేరు తప్పనిసరి
' దరఖాస్తు ఫారాల్లోనే అవకాశం కల్పించాలి
' యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లకు యూజీసీ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: విద్యా సంబంధిత డిగ్రీలు, ఇతర అన్ని సర్టిఫికెట్లలో తల్లి పేరును తప్పనిసరిగా చేర్చాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లకు ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లలోనే కాకుండా వివిధ కోర్సుల దరఖాస్తు ఫారాల్లోనూ తల్లి పేరు రాసే కాలమ్ ఉంచాలని పేర్కొంది. దరఖాస్తు ఫారాలు, సర్టిఫికెట్లలో విద్యార్థి ఇంటి పేరు, విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు స్పష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని యూజీసీ ఇన్‌చార్జి సెక్రటరీ ఉపమన్యు బసు వీసీలకు ఆదేశాలు జారీ చేశారు.
కొత్త డిగ్రీలకు యూజీసీ అనుమతి ఉండాల్సిందే
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించని డిగ్రీలను ఏ యూనివర్సిటీ కూడా నిర్వహించడానికి వీలులేదని, అలాంటి డిగ్రీలను ఇవ్వరాదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో వర్సిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించరాదని సూచిస్తూ వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త డిగ్రీని ప్రవేశపెట్టాలనుకుంటే ఆరు నెలల ముందుగా యూజీసీకి దర ఖాస్తు చేసుకుని గుర్తింపు పొందాలని సూచించింది.